Skip to main content
Latest News

దుస్తులు విప్పితేనే నటన నేర్పిస్తానన్న వ్యక్తి అరెస్ట్

నగ్నంగా నిలబడితేనే నటన నేర్పిస్తానంటూ అసభ్యంగా ప్రవర్తించిన డ్యాన్స్ మాస్టర్ వినయ్ వర్మను హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా మొదట్లో తాత్సారం చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు రావడంతో అప్రమత్తమయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ఒత్తిడితో ఎట్టకేలకు వినయ్ వర్మపై కేసు నమోదు చేసి... అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు. 

అయిదు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఓ యువతి చేసిన ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి..దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తానంటూ ఓ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అనుచిత ప్రవర్తన చేస్తున్నాడని అచింత కౌర్ చద్దా అనే యువతి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. హిమాయత్ నగర్‌లో ఉన్న ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’లో వినయ్ వర్మ అనే డైరెక్టర్‌ ఈ నీచానికి పాల్పడుతున్నారని అంచిత ఆరోపించారు. ఇటీవల తనతో సహా మరో ఎనిమిది మంది విద్యార్థులు ఈ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవడానికి చేరారని వివరించారు. ఉదయం 6:30 నుంచి ఉదయం 9:30 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని డైరెక్టర్ చెప్పారన్నారు. శిక్షణలో భాగంగా ఏప్రిల్ 16న వినయ్ వర్మ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నడుస్తున్నాయన్నారు. ఇంతలో తలుపులు, కిటికీలు అన్ని మూయమని ఆయన చెప్పారన్నారు. ‘అందరినీ దుస్తులు తొలగించమని చెప్పారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను విప్పనని చెప్పా.. అప్పటికే చాలా మంది బట్టలు విప్పి నగ్నంగా ఉన్నారు. నేను విప్పకపోవడంతో ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మన్నారు.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..? మా కలలు నేర్చుకోవడానికి మీ దగ్గరకు వస్తే ఇదా మీరు చేసేది..?’.. అంటూ అచింత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ యువతి ఆరోపణలపై స్పందించిన వినయ్ వర్మ.. అదంతా నటనలో భాగమేనంటూ వివరణ ఇచ్చాడు. అన్ని రకాలుగా నటనను నేర్పేందుకే తాను ఆ పని చేశాననీ.. ఎలాంటి దురుద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చాడు. అదంతా నటనలో భాగమేనన్నాడు. చివరకు ఆమె పోరాటం ఫలించి.. అతడు కటకటాల పాలయ్యాడు..