Skip to main content
Latest News

టిక్‌టాక్‌పై నిషేధంతో.. రోజుకు ఇన్ని కోట్ల రూపాయల నష్టమా..!?

భారత్‌లో నిషేధం విధించడంతో ఫేమస్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ విలవిలలాడిపోతోంది. భారత్ విధించిన నిషేధంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఒక్కో రోజుకు 5లక్షల డాలర్లు.. అంటే ఏకంగా 3.5 కోట్ల రూపాయల మేర కంపెనీ నష్టపోతోందని వాపోతున్నారు. సంస్థకు నష్టం వాటిల్లడమే కాకుండా.. ఇప్పటికే పనిచేస్తున్న 250మంది ఉద్యోగుల భవితవ్యంపై కూడా కత్తి వేలాడుతోందన్నారు. వీడియోలకు అదనపు హంగులు జోడించి స్నేహితులతో పంచుకునే టిక్‌-టాక్‌ యాప్‌ అనతి కాలంలోనే ఎంతో పాపులర్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌కు 1 బిలియన్‌కు పైగా యూజర్లు ఉన్నారు. భారత్‌లో ఏకంగా 300మిలియన్ల మంది అంటే 30 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

కోర్టు ఆదేశాలతో టిక్‌టాక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ యాప్స్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు టిక్‌టాక్‌పై విధించిన తాత్కాలిక నిషేధంపై ఏప్రిల్ 24లోపు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో నిషేధాన్ని ఎత్తివేస్తామని మద్రాస్ హైకోర్టుకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ యాప్‌ ద్వారా పోర్నోగ్రఫీ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత్‌లో టిక్‌-టాక్‌ డౌన్‌లోడ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నష్టాలు చుట్టుముట్టడంతో టిక్ టాక్ ప్రతినిధులు కోర్టు మెట్లెక్కారు. టిక్‌-టాక్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ మేరకు యాపిల్‌, గూగుల్‌ సంస్థలను ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ‘యాప్‌పై నిషేధం ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాదు, రోజుకు దాదాపు 1 మిలియన్ల కొత్త యూజర్లను కోల్పోతున్నాం.’ అని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వచ్చే బుధవారం ఈ కేసు విచారణకు రానుంది. మరి తుది తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు మాత్రం టిక్‌టాక్‌ను యథాతథంగా ఉపయోగిస్తున్నారు.