Latest News

ముగిసిన సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబునాయుడు  చేపట్టిన ధర్మపోరాటం దీక్ష 12గంటలు ముగిసింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు ఉదయం 7గంటలకు దీక్షకు కూర్చున్నారు. ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా, దీక్షను కొనసాగించారు. 68 ఏళ్ల వయసులోనూ.. 12గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా  తీసుకోండా దీక్ష చేశారు చంద్రబాబు. ఏపీ సీఎం చేస్తున్న ధర్మపోరాటానికి టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలిపాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి మద్దతుగా నిలిచాయి.  
ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున చలసాని శ్రీనివాస్‌తో పాటు.. పలువురు నాయకులు కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. వివిధ కుల సంఘాల నేతలు దీక్ష శిబిరం వద్దకు క్యూ కట్టారు. సీఎంకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగ సంఘాలు, యూనియన్లు, ప్రజల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. భారీ ఎత్తున మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చి.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ధర్మపోరాట దీక్ష ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం దీక్ష చేపడితే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత సమస్యలపై స్పందనకు ఈరోజే సరైన రోజా అని ప్రశ్నించారు. రేపు చేయొచ్చు కదా? అన్నారు. 
వ్యక్తిత్వాలను హననం చేసే పనులను టీడీపీ ఎప్పుడూ చేయదు... అలాంటి చరిత్ర తమకు లేదన్నారు. రాజకీయాల్లో రాని వాళ్లు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, నోటికి హద్దులేకుండా పోతోందని చంద్రబాబు అన్నారు. పవన్ తన ట్వీట్ల ద్వారా స్పందిస్తూ టీడీపీ అనుకూల వ్యక్తులు, సంస్థల ప్రోద్బలంతో తన తల్లిని తిట్టించారని ఆరోపించిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.

విశాఖ రైల్వేజోన్‌పై నాలుగేళ్లుగా కాలయాపన చేస్తున్నారని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. జాతీయ విద్యాసంస్థలకు అరకొర నిధులిస్తున్నారని, ఇంకా కొన్ని సంస్థలు తెలంగాణకే పన్ను కట్టే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ ఊసేలేదని, షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదని సీఎం మండిపడ్డారు. చట్టంలో ఉన్నా అసెంబ్లీ సీట్లు పెంచలేదని ఆరోపించారు. 
‘‘నాపై నమ్మకంతో రాజధానికి 34వేల ఎకరాల భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.40వేల కోట్లు. ఢిల్లీ చిన్నబోయేలా అమరావతి నిర్మిస్తామని మోదీ హామీ ఇచ్చారు. రాజధానికి రూ.1500కోట్లు ఇచ్చి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పటేల్‌ విగ్రహానికి రూ.2500కోట్లు కావాలా? రాజధానికి రూ.1500కోట్లేనా. ఏపీకి ఎందుకివ్వరు? ఏపీ ప్రజలు పన్నులు కట్టడంలేదా? దగాపడిన ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అంటూ కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. 
తమిళనాడు మాదిరి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, ఇమేజ్‌ ఉన్న నాయకుడితో పెట్టుకుంటే కుదరదని వారికి తెలుసని, అందుకే వైసీపీలాంటి కళంకిత పార్టీకి దగ్గరయ్యారని ఆరోపించారు. వైసీపీని దువ్వి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని, రాష్ట్రపతి ఎన్నికల్లో లాలూచీ పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు.

పెద్దల చెప్పిన మాటనే తాను కేంద్రం విషయంలో ఫాలో అయ్యానని చంద్రబాబు అన్నారు. సామ, దాన, బేధ, దండోపాయాల్ని ప్రయోగించానన్నారు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో పోరాటం మొదలుపెట్టానని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఎవ్వరూ తనని చెప్పుచేతల్లో పెట్టుకోలేరని అన్నారాయన. 
కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. అందుకు తగ్గట్టు బదులిస్తామన్నారు చంద్రబాబు. కర్నాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్‌ చేసే అవకాశం లేకపోలేదన్నారు. ఒకసారి పోరాటం మొదలుపెట్టాక.. భయపడి వెనక్కు తిరిగే పరిస్థితి లేదని సీఎం తేల్చి చెప్పారు.