Skip to main content
Latest News

కర్ణాటకలో కాంగ్రెస్‌ జాబితా ఖరారు

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల చరిత్రలో అత్యధికంగా కర్ణాటకలోని 218 విధానసభ స్థానాలకు అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించింది. ఇందుకోసం ఐదు రోజుల పాటు దిల్లీలో అధిష్ఠానం వరుస సమావేశాల్ని జరిపి చిట్టచివరకు జాబితాను విడుదల చేసింది. మొత్తం స్థానాల సంఖ్య 224. అందులో ఐదు స్థానాలకు... కిత్తూరు, సింధగి, రాయచూరు సిటి, శాంతినగర, నాగఠాణలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. మండ్య జిల్లా పాండవపుర మేలుకోటె స్థానానికి అభ్యర్థిని నిలబెట్టడం లేదు. ఇదివరకూ విధానసభలో ఆ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన రైతు సంఘం నేత పుట్టణ్ణయ్య ఇటీవల హఠాన్మరణం పాలయ్యారు. ఇందుకు సానుభూతిగా ఆయన కుమారుడికి మద్దతునివ్వాలనే ఆలోచనతో అభ్యర్థిని నిలపడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టణ్ణయ్య కుమారుడు దర్శనకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది.

ఒక్క చోటు నుంచే... 
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వస్థలం చాముండేశ్వరితో పాటు బాగటకోట జిల్లా బాదామి నుంచి కూడా పోటీ చేస్తారని ఇప్పటివరకూ జరిగిన ప్రచారానికి విలువ లేకుండా పోయింది. చాముండేశ్వరి స్థానం నుంచి మాత్రమే ఆయన పోటీ చేయనున్నారు. వృద్ధులకు టిక్కెట్లు ఇవ్వబోమని ఇది వరకూ నాయకత్వం చెబుతూ వచ్చినా కొందరికి చోటు లభించింది. 75 ఏళ్లు దాటిన వయోవృద్ధులు కాగోడుతిమ్మప్ప (సాగర), కెబి.కోళివాడ్‌ (రాణిబెన్నూరు.), శ్యామనూరు శివశంకరప్ప (దావణగెరె దక్షిణం)కు టిక్కెట్లు ఇచ్చారు. జనతాదళ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఏడుగురికీ అవకాశమిచ్చారు. ‘ఘనులు’గా పేరుగాంచి ఇటీవలే భాజపా నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆనంద్‌ సింగ్‌ (విజయనగర), నాగేంద్ర (బళ్లారి) కూడా జాబితాలో ఉన్నారు. గత విధానసభ ఎన్నికల్లో 2500 లోపు ఓట్ల తేడాతో పరాజయం పాలైన వారందరికీ టిక్కెట్లు ఇచ్చారు. గత ఏడాదిగా కనీసం పదిసార్లు వివిధ సంస్థలతో సర్వేల్ని చేయించి జనాదరణ కలిగిన, ప్రజావ్యతిరేకత లేని, గెలిచే అవకాశాలున్నా వారికే టిక్కెట్లు ఇచ్చామని అగ్రనేతలు ప్రకటించారు. బెళగావ జిల్లాలో జార్ఖిహోళి సోదరులు, మైసూరు జిల్లాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-ఆయన కుమారుడు డాక్టర్‌ యతీంద్ర, దావనగెరె జిల్లాలో తండ్రి కొడుకులు శ్యామనూరు శివశంకరప్ప-మల్లికార్జున, రాజధాని బెంగళూరులో హోంమంత్రి రామలింగారెడ్డి-ఆయన కుమార్తె సౌమ్యరెడ్డి, తుమకూరు జిల్లాలో మంత్రి జయచంద్ర- ఆయన తనయుడు సంతోష్‌ పోటీ చేస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సిద్ధయ్య, పోలీస్‌ ఐజీ స్థాయి అధికారి భార్య అంజలి నింబాల్కర్‌ని పోటీకి నిలిపారు.

భగ్గుమన్న అసమ్మతి 
టిక్కెట్టు లభించని పలువురు నేతలు ఆగ్రహించారు. కర్ణాటక ఉత్తరం నుంచి దక్షిణం వరకూ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. కొన్ని చోట్ల మోటారు వాహనాల చక్రాలకు నిప్పు పెట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలి జాబితాలో చోటు లభించని కిత్తూరుతో పాటు  తరికెరె, బాదామి, చిక్కమగళూరు, జగళూరు, మాయకొండ తదితర నియోజకవర్గాల్లో టిక్కెట్లు దొరకని నాయకులు, వారి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.