Skip to main content
Latest News

ఇంత నిర్లక్ష్యమా..? తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదా..?

తప్పు మీదే.. ఇంత నిర్లక్ష్యమా..? అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మేం అర్ధరాత్రి వరకు పనిచేశాం.. లక్షలాది విద్యార్థులు ఆందోళోనలో ఉంటే మీరు అర్ధరాత్రి వరకు పనిచేయలేరా..? బోర్డు చేసిన తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించాలా..? వాళ్లు ఉసురు తీసుకుంటోంటే చూస్తూ ఊరుకుంటారా..? విద్యార్థుల సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదా..?’ అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్లక్ష్యం వల్ల 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జవాబు పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు పి.అచ్యుతరావు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దీన్ని అత్యవసర పిటిషన్‌ కింద పరిగణనలోకి తీసుకుని.. హైకోర్టు ఏసీజే జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

తప్పు మీరు చేసి.. ఫెయిల్‌ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే రీ-వాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ చేస్తామంటే ఎలా?..? అంటూ ఇంటర్‌ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలదీసింది. బోర్డు తాను చేసిన తప్పును తానే సరిదిద్దుకోవాలని సూచించింది. కోర్టుకు హాజరైన ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఉద్దేశించి.. ‘‘3 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలు పునర్‌ మూల్యాంకనానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత మంది సిబ్బంది అవసరం?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఆయన.. 3 లక్షల మంది జవాబు పత్రాల పునర్‌ మూల్యాంకనానికి 2నెలలు పడుతుందని ఏఏజీ తెలపగా.. ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చిలో జరిగిన పరీక్షకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని ప్రశ్నించింది. సుమారు 9.70 లక్షల మంది హాజరైనట్లు బదులివ్వగా.. అంతమంది జవాబు పత్రాలు నెలలోనే మూల్యాంకనం చేస్తే 3 లక్ష మంది జవాబు పత్రాల వాల్యుయేషన్‌కు 2 నెలలు ఎందుకు పడుతుందని నిలదీసింది.  గట్టిగా పదిరోజుల్లో చేయొచ్చని.. అవసరమైతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 24 గంటలూ పనిచేయాలని సూచించింది. సోమవారానికల్లా ఒక పరిష్కారం చూపండని ఆదేశించింది.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.