Skip to main content
Latest News

రేపు అభినందన్‌కు వీరచక్ర పురస్కారం

భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని అందజేయనుంది. ఐఏఎఫ్‌ సిఫారసులతో కేంద్రం అభినందన్‌కు వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయనతో పాటు ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌కు యుద్ధసేవా పతకాన్ని ప్రదానం చేయనున్నారు. పలువురు జవాన్లకు శౌర్యచక్ర, కీర్తిచక్ర అవార్డులను కూడా అందించనున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ.. దేశ రహస్యాలను అభినందన్ బయటపెట్టలేదు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్‌ కూడా కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్‌ సైనికులకు అప్పగించారు. దౌత్య ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను దాయాది దేశం విడిచిపెట్టింది. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ,ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ను వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. ఇటీవలే అన్ని మెడికల్ టెస్టులు పూర్తి చేసుకున్న అభినందన్.. త్వరలోనే విధుల్లో చేరబోతున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన సందర్భంలో గాయపడిన నేపథ్యంలో అభినందన్ విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News