Skip to main content
Latest News

మరణంలోనూ వీడని సోదర బంధం.. తమ్ముడి మరణవార్త తెలిసి అన్న కూడా..

ఏక కాలంలో జన్మించకపోయినా ఈ ఏకోదరులు ఒకరివెనుక మరొకరు తనువు చాలించారు. చిన్నతనం నుంచీ ఒకే తాటిపై నిలిచి జీవనపయనం సాగించిన వీరి బంధాన్ని చావు సైతం  విడదీయలేకపోయింది. తమ్ముడు చంద్రమోహన్‌ (35) గుండెపోటుతో మృతి చెందగా విషయాన్ని జీర్ణించుకోలేని బాలరాజు (40) అనారోగ్యానికి గురై తనువు చాలించడం కుటుంబంలో పెనువిషాదాన్ని రేపింది. విషాదం నిండిఉన్న ఇంట మరో విషాదం తలెత్తడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. ఒకరి వెనుక మరొకరు కుటుంబపెద్దలే మృతి చెందడంతో కుటుంబీకులను ఎవరు ఆదుకుంటారో ఎదురు చూడాలి మరి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ కాల్వకట్టవీధిలో మంగళవారం చోటుచేసుకున్న పెనువిషాద సంఘటనలోకెళితే....

కాల్వకట్టవీధిలో ఆవుల బాలరాజుకు ఇద్దరు తమ్ముళ్లు. అయితే ఆవుల బాలరాజు ఆధ్వర్యంలో చిన్ననాటి నుం చి ఒకే విధానంలో ఉమ్మడిగా జీవనం సాగిస్తున్నారు. బాలరాజు సీఐటీయూలో క్రీయాశీలకం గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రొద్దుటూరు సమితి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. చంద్రమోహన్‌ కూలి పనులకు వెళ్తుండగా, మరో సోదరుడు చిన్నోడు హోటల్‌లో పని చేస్తూ వచ్చే డబ్బుతో సంసారం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, చంద్రమోహన్‌కు సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను  చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. తమ్ముడు చంద్రమోహన్‌ ఇక లేడన్న సత్యాన్ని అన్న బాలరాజు జీర్ణించుకోలేకపోయాడు. అదే ధ్యాస, ఆవేదనతో రాత్రంతా బరువుగా గడిపాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు బాలరాజు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే బాలరాజును కుటుంబ సభ్యులు పెద్దాస్పత్రిలో చేర్పించారు. ఆయనచికిత్స పొందుతూ మృతి చెందాడు. 

హైబీపీ, ఆయాసంతో బాధపడతున్నా, ఆస్పత్రి లో ఎవరూ పట్టించుకోలేదని, ఆయాసం ఉపశమనానికి మందులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. ఉదయం 6 గంటలకు ఆస్పత్రిలో చేరితే, 8.30 గంటలకు డ్యూటీ డాక్టర్‌ వచ్చి చూశాడని, ఆప్పటికే పరిస్థితి విషమించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతే కొద్దిసేపటికే బాలరాజు చనిపోయాడని కుటుంబసభ్యులు రోధిస్తూ తెలిపారు. కాగా మృతుల్లో చంద్రమోహన్‌కు భార్య మరియ మ్మ, కుమార్తె ధరణి ఉన్నారు. ధరణి ఐదో తరగతి చదువుతోంది. బాలరాజుకు భార్య సంజమ్మ, కుమార్తె అంజలి ఉన్నారు. అంజలి పదో తరగతి చదువుతోంది. ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉంటున్న అన్నదమ్ములు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు మృత్యువొడికి చేరుకోవడం స్థానికులను కలచివేసింది. అన్నదమ్ములిద్దరు ఒకరిపై ఒకరు ఎంతో అభిమానంగా ఉండేవారని, మరణంలోను వీరి బంధం వీడలేదని పలువురు పేర్కొన్నారు. 


మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!