Skip to main content
Latest News

ఆ బ్యాంక్ నుంచి రోజుకు రూ.1000 మాత్రమే విత్‌డ్రా.. గగ్గోలు పెడుతున్న కస్టమర్లు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్‌(పీఎంసీ) పై ఆరు నెలల  పాటు ఆంక్షలు విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, సెక్షన్ 35 ఎ కింద ఈ చర్య తీసుకున్నట్టు ఆర్‌బీఐ మంగళవారం జారీ చేసిన ఒక నోటీసులో పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మహారాష్ట్రలోని పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంల్లో రోజుకు వెయ్యి రూపాయలకు మించి నగదును పొందలేరు. సేవింగ్స్, కరెంట్ ఖాతాలతో పాటు ఇతర ఖాతాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. దీంతోపాటు  ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాను ఓపెన్‌ చేసే అవకాశం కూడా లేదు. ఈ నిబంధన మంగళవారం నుంచే అమలుకానుంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన అమలులో ఉండనుంది. పీఎంసీ బ్యాంకుకు ఇక నుంచి కొత్తగా ఎలాంటి రుణాలను గానీ, గ్రాంట్లను గానీ అందించేది లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే.. పీఎంసీ బ్యాంకు లైసెన్స్‌‌ను మాత్రం ఆర్బీఐ రద్దు చేయకపోవడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందుల్లో పడ్డారు. 

ఆ బ్యాంక్ నుంచి రోజుకు రూ.1000 మాత్రమే విత్‌డ్రా.. గగ్గోలు పెడుతున్న కస్టమర్లు..

ప్రధానంగా ముంబై బ్రాంచ్‌ వద్ద కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఒకవైపు రానున్నది పండుగ సీజన్‌.. మరోవైపు వెయ్యి రూపాయలకు మించి  నగదు ఉపసహంరణ  కూడదనే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య జనులపై తీరని భారమని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బ్యాంకు స్పందించింది. గడుపులోపే పరిస్థితిని చక్కదిద్దుతామని  పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్‌ థామస్‌ వినియోగదారులకు రాసిన ఒక లేఖలో వివరణ ఇచ్చారు.  ఇది డిపాజిటర్లకు, కస‍్టమర్లందరికీ కష‍్టమైన సమయం అంటూ క్షమాపణలు  చెప్పారు. దయచేసి తమతో  సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ పరిస్థితిని అధిగమించి బలంగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. కాగా 1984లో ముంబైలో​ ప్రారంభమైన ఈ బ్యాంకు పలు రాష్ట్రాల్లో, 137 బ్రాంచ్‌లతో తన సేవలను అందిస్తోంది. కోపరేటివ్‌ బ్యాంకుల్లో టాప్‌ 10లో చోటు సంపాదిస్తున్న పీఎంసీ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గోవా, గుజరాత్‌, ఏపీ, తెలంగాణ‌, మధ్యప్రదేశ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News