Skip to main content
Latest News

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు..!

ఈ–కామర్స్‌ సంస్థలు పండుగల సీజన్‌లో భారీ తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దసరా, దీపావళి పండుగల అమ్మకాల కోసం 90,000 మందిని తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్‌ సేవా వంటి విభాగాల్లో వీరి నియామకం జరగనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరగనున్నట్లు వివరించింది. మరో ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ సీజన్‌లో తాత్కాలికంగా 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్, కస్టమర్‌ సపోర్ట్, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో వీరి అవసరం ఉందని తెలిపింది. 

గిడ్డంగుల నుంచి వినియోగదారుల సేవా కేంద్రాల వరకూ వివిధ స్థాయుల్లో వీరంతా పనిచేయనున్నారని ఆయా సంస్థలు తెలిపాయి. అమెజాన్‌ ఇండియా ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా అదే తేదీల్లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 30 శాతం ఉద్యోగాలను సృష్టించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. తాత్కాలిక ఉద్యోగ నియామకాల ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ సేవల్ని అందించేందుకు వీలు కలుగుతుందని అమెజాన్‌ పేర్కొంది.
 
దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 15 కేంద్రాలతో వినియోగదారులకు సేవలందిస్తున్నామని తెలిపింది. ఈ-మెయిల్‌, చాటింగ్‌, సోషల్‌ మీడియా, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వినియోగదారులతో నిత్యం మాట్లాడేందుకు ఈ కేంద్రాల్లో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించింది. గిడ్డంగుల విస్తీర్ణాన్ని, డెలివరీ కేంద్రాల సంఖ్యను కూడా అమెజాన్‌ భారీగా పెంచేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 1400 డెలివరీ కేంద్రాల్ని ఆ సంస్థ నిర్వహిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా తీసుకుంటున్న వారందరికీ శిక్షణనిచ్చింది. ప్రభుత్వం రూపొందించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లో భాగంగా ఈ మొత్తం ఉద్యోగ కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News