Skip to main content
Latest News

ఖైరతాబాద్ విగ్రహం ఎత్తు పెరిగింది.. ఇదే రికార్డు స్థాయిలో తొలిసారి..

గణేష్ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే. దీనికి కారణం భారీ ఆకారం, విగ్రహం ఎత్తే. గణేష్ నవరాత్రులకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది గణనాథుడి విగ్రహం ఎలా ఉంటుందా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకతలు తెలుసుకోవాలని ముచ్చటపడుతున్నారు. వారు ఆశించినట్టే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహంలో అనేక విశేషాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేకతను చాటే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 12 తలలు, 24 చేతులతో శ్రీద్వాదశాదిత్య మహాగణపతి నామంతో కొలువు దీరనున్నారు. అంతేకాదు.. విగ్రహం ఎత్తు 61 అడుగులు. ఈ సారి ఇదే ప్రత్యేకత. ఇప్పటివరకు విగ్రహం ఎత్తు 60 అడుగులే. ఈసారి మాత్రం 61 అడుగుల ఎత్తు ఉండనుంది. ఇది ఫస్ట్ టైమ్.  ఇప్పటికే 90శాతం విగ్రహ నిర్మాణం పూర్తయిది.. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో విగ్రహం పూర్తవనుంది. 

ద్వాదశాదిత్య వినాయక విగ్రహ ప్రత్యేకతలివే:
భక్తుల కోరిక మేరకు ప్రతియేటా ప్రముఖ సిద్ధాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచనతో గణేశుడి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ తయారుచేస్తుంటోంది. ఈసారి వికారి నామ సంవత్సరంలో గ్రహాలకు అధిపతియైున సూర్యుడి రూపంలో గణపతిని తయారుచేసి పూజిస్తే లోకకల్యాణం జరుగుతుందని, వాతావరణం అందరికీ అనుకూలించేలా ఉంటుందని, ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండవని సిద్ధాంతి విఠలశర్మ వివరించారు. గణేశుడితోపాటు దత్తాత్రేయ స్వామి, సిద్దకుంజికా దేవీలను ఈ స్థలంలో పూజిస్తే రాహు, కేతు, శనితోపాటు అన్ని దోషాలు తొలగిపోతాయనే సూచన మేరకు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతిగా వినాయకుడిని తయారుచేస్తున్నారు. తొలిసారిగా గణపతికి కింద 7, పైన 5 కలిపి మొత్తం 12 తలలు, 24 చేతులను ఏర్పాటు చేశారు. 12 తలలపై 12 సర్పాలు, వాటి పడగల్లో శివలింగాలు కొలువుదీరనున్నాయి. గణపతి వెనుకవైపున భారీ ఆకారంలో సూర్యుడి రూపం, ఆయనతో పాటు సూర్యుడి రథాన్ని పోలుస్తూ ఇరువైపులా 7అశ్వాలు రథంపై ఉండే విధంగా కొలువుదీరాయి. గణపతికి కుడివైపున 10 అడుగుల ఎత్తుతో 3 తలలు, 6 చేతులతో సింహాసనంపై కూర్చున్న సిద్దకుంజికా దేవి విగ్రహం, ఎడమవైపున 12అడుగుల ఎత్తుతో 3 తలలతో దత్తాత్రేయ స్వామి, ఆవుతో కలిసి నిలబడ్డ విగ్రహాలు తయారయ్యాయి. ఇక వినాయకుడితో పాటు ప్రతియేటా పూజలందుకునేందుకు విశేష దేవతలుగా కుడివైపున 18 అడుగుల ఎత్తుతో పులి వాహనంగా ఏకాదశి దేవి, శేషతల్పంపై పడుకుని ఉన్న మహా విష్ణువును పూజిస్తున్న విగ్రహం చూడముచ్చటగొల్పుతోంది. ఎడమవైపున 20 అడుగుల ఎత్తుతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సహిత శక్తి స్వరూపిణీ అయిన దుర్గాదేవి పద్మ కమలంపై ఆసీనురాలైన విగ్రహం కొలువుదీరింది.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News