Skip to main content
Latest News

హైదరాబాద్ అతలాకుతలం.. నేడు, రేపు కూడా తీవ్ర వర్షాలు

వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్‌లో కుండపోతగా వాన కురిసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో కుంభవృష్టి కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరసి లేకుండా వర్షం పడింది. అధిక వర్షాలతో హైదరాబాద్‌ నగర జనజీవనం అతలాకుతలమైంది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో ఇళ్లకు వెళ్లేందుకు గంటలకొద్దీ ప్రయాణించాల్సి వచ్చింది. రోడ్లపై నిలిచిన నీటిని పారదోలేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు తీవ్రంగా శ్రమించారు. బస్తీల్లోని, కాలనీల్లోని ఇళ్లల్లోకే కాదు.. ఆస్పత్రుల్లోకి, పోలీస్ స్టేషన్లలోకి సైతం నీళ్లు వచ్చేశాయి.

Read Also : షావోమీ నుంచి అదిరిపోయే మోడల్.. కొత్త ఫీచర్లతో రెడ్‌మీ 8A

జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే మార్గంలో, మరికొన్ని చోట్ల అర్ధరాత్రి 12 గంటల దాకా ట్రాఫిక్‌ కష్టాలు కొనసాగాయి. ప్రగతిభవన్‌ సమీపంలోని రోడ్లు జలమయమయ్యాయి. మంత్రి కేటీఆర్‌ వాహనం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. వాన తాకిడికి అసెంబ్లీ ఎదుట భారీ వృక్షం నేలకూలింది. రవీంద్రభారతి సమీపంలోని కామత్‌ హోటల్‌లోకి నీళ్లు చేరాయి. ఐటీ కారిడార్‌లో విడతల వారీగా ఉద్యోగులను వదలాలన్న నిర్ణయం ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో మాదాపూర్‌, సైబర్‌ టవర్స్‌, మైండ్‌స్పేస్‌, గచ్చిబౌలి- కొండాపూర్‌, గచ్చిబౌలి- ఐఐఐటీ, గచ్చిబౌలి- ఔటర్‌ రింగ్‌ రోడ్డు మార్గాల్లో కిలోమీ టర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కొండాపూర్‌ జంక్షన్‌ నుంచి హైటెక్‌సిటీ వైపు వచ్చే మార్గంలోనూ వాహనాల రాకపోకలు స్తంభించాయి. నిజాం కళాశాల నుంచి ఆబిడ్స్‌, కోఠి, మొజంజాహి మార్కెట్‌ మార్గంలో నల్గొండ చౌరస్తా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

ఇంటీరియర్‌ కర్ణాటక, దాన్ని ఆనుకుని ఉన్న రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి జార్ఖండ్‌ వరకు తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఒకేసారి రావడంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతమే అనేకచోట్ల ఒకేసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News