Skip to main content
Latest News

ఈ సీన్ చూస్తే.. మీ కళ్లు చెమర్చక మానదు..!

చిత్తూరు జిల్లా గంగవరం మండలం.. ఎనుగుల దాడికి ఆ మండలంలో ఎన్నో గ్రామాలు అతలాకుతలం అవుతుంటాయి. పంట పొలాలు నాశనమవుతుంటాయి. వందలాది ఏనుగులు ఒక్కసారిగా దూసుకొచ్చి ఊళ్ల మీద పడుతుంటాయి. పూరిపాకల్లో దాక్కున్నా.. ఆ పాకలను తొక్కుంటూ మనుషుల ప్రాణాలు తీస్తుంటాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏనుగులు ఊళ్ల మీదకు, పొలాల మీదకు దాడి చేస్తాయోనని ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని భయంభయంగా గడుపుతుంటారు. ఆ భయానక ఘటనే.. సోమవారం మరోసారి జరిగింది. 

గంగవరం మండలంలోని గాంధీనగర్‌ గ్రామ సమీప పొలాల వద్ద క్రిష్ణమూర్తి, లక్ష్మీనారాయణ అనే రైతులు తమ పశువులను రాత్రివేళలో గొడ్లపాకలో కట్టేసేవారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అటవీ ప్రాంతంలోని పొలాల మీదుగా వచ్చిన ఏనుగులు గొడ్లపాకలో ఉన్న ఆవు, దూడలపై దాడి చేశాయి. ఏనుగు తొండంతో దూడను తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆవు నడుము విరిగిపోవడంతో అక్కడి నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. ఆ బాధను తట్టుకోలేక సోమవారం ఉదయం మరణించింది. ఆ విషయం తెలియని నెలన్నర వయస్సున్న లేగదూడ పాల కోసం తాపత్రయపడింది. కాసేపు తల్లి ఆవు వద్ద పాలు తాగి ఆకలి తీర్చుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు. తల్లి మరణించిన విషయం తెలీక.. ఆ దూడ చేసిన పనిని చూసి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పెట్టగా.. అదికాస్తా వైరల్ అయింది. ఏనుగుల బాధ నుంచి తమను కాపాడాలంటూ ఆ మండలంలోని ప్రజలు కోరుతున్నారు. అదే గ్రామానికి చెందిన మరిన్ని పశువుల కొట్టాలను ఏనుగులు నాశనం చేశాయి. మరికొన్ని పశువులు భయపడి అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి.

ఈ ఘటనలతో ఆవేదన చెంది దాదాపు 60 మంది రైతులు సోమవారం పలమనేరు అటవీశాఖ కార్యాలయం వద్దకు చనిపోయినదూడతో సహావచ్చి కార్యాలయం ముందు జాతీయరహదారిపై ధర్నా చేశారు. దీంతో జాతీయ రహదారిపై దాదాపు గంటకుపైగా ట్రాపిక్‌ స్తంభించింది. ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని, అంతవరకు ఎక్కడికీ వెళ్లమని భీష్మించుకొని నిలబడ్డారు. దీంతో అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ మధుసూదన్‌, సిబ్బంది రైతులకు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సెక్షన్‌ ఆఫీసర్‌ కలగజేసుకొని ఏనుగుల దాడుల నివారణకు విద్యుత్‌ కంచెనిర్మాణం 3 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. పోలీసులు కూడా రైతులకు నచ్చజెప్పడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు.

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News