Skip to main content
Latest News

గిఫ్ట్‌బాక్సుల్లో ఫ్రెండ్స్ తెచ్చిన బహుమతిని చూసి అవాక్కైన వధూవరులు..

కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొని వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దేశ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్‌పై, రోడ్డు రవాణా భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. గతంలో చూసీ చూడనట్లు ఊరుకునేవారు. కానీ ప్రస్తుతం తీరు మారింది. చిన్న తప్పుకే భారీ శిక్ష వేస్తున్నారు. హెల్మెట్ లేకుంటే వందల్లో కాదు.. వేలల్లో జరిమానాలు విధిస్తున్నారు. పది వేలు, ఇరవై వేలు, ముప్ఫై వేలంటూ.. పోలీసులు విధిస్తున్న జరిమానాలతో వాహనదారులు గుండెలు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లి వేడుకలో జరిగిన అరుదైన సన్నివేశం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడి పెళ్లికి హాజరైన అతడి మిత్రులు వధూవరులకు హెల్మెట్లు గిఫ్ట్‌గా ఇచ్చి అందరికీ ఊహించని షాకిచ్చారు. వధూవరులిద్దరూ హెల్మెట్లతో, పక్కన ఫ్రెండ్స్‌తో ఫొటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

చెన్నైలోని ఆవిడి ప్రాంతంలోని కల్యాణ మండపంలో మోహన్-విశాలిల వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. వేడుకకు హాజరైన వరుడి తరపు స్నేహితులు.. వేదిక మీదకు వచ్చారు. వధూవరులిద్దరికీ రెండు గిఫ్ట్‌ బాక్సులను ఇచ్చారు. వాటిని ఓపెన్ చేయమన్నారు. గిఫ్ట్ బాక్సులను ఓపెన్ చేసిన వధూవరులిద్దరూ.. లోపల ఏమున్నాయో చూసి ఖంగుతిన్నారు. రెండు హెల్మెట్లను గిఫ్ట్ బాక్సుల్లోంచి పైకి తీయడంతో అంతా అవాక్కయ్యారు. ఇటీవల భారీ ఫైన్ల నేపథ్యంలో హెల్మెట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం.. వరుడి భద్రతకు సంబంధించి ఉండటంతో.. ఆ మిత్రులపై అంతా పొగడ్తల వర్షం కురిపించారు. అలా రెండు హెల్మెట్లు బహుమతిగా ఇచ్చి వారు ప్రత్యేకతను చాటుకున్నారు. మోటార్ సైకిల్‌పై వెళ్ళేటప్పుడు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్లు ఇచ్చి వారి భద్రత తమకెంత ముఖ్యమో తెలియజెప్పిన స్నేహితులను పెళ్లికొచ్చిన వారు అభినందించారు. ఈ ఫొటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఇదే విధంగా హెల్మెట్లను గిఫ్ట్‌గా ఇవ్వడంటూ.. పోలీసులు కూడా సూచిస్తున్నారు. 

గిఫ్ట్‌బాక్సుల్లో ఫ్రెండ్స్ తెచ్చిన బహుమతిని చూసి అవాక్కైన వధూవరులు..