Skip to main content
Latest News

74 ఏళ్ల మంగాయమ్మకు సంతానం కల్పించిన.. అహల్య ఐవీఎఫ్ సెంటర్ కీలక నిర్ణయం

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలిగానీ.. ఇదేం చిత్రమండీ బాబు.. ఇప్పడు పిల్లల్ని కనడం ఏవిటి.. అసలు ఎవరండీ ఆ డాక్టరు. సైన్సు అభివృద్ధి చెందిందని ప్రయోగాలు చేస్తారా అంటూ చాలా మందే 74 ఏళ్ల బామ్మ కవలలు జన్మ నివ్వడం గురించి మెటికలు విరిచారు. ఆ వయసులో సంచలనమే కావచ్చు. కానీ ఆచరణలో ఎంత కష్టం. ఒకరి మీద ఆధారపడే వయసులో బిడ్డల్ని కనడం అంటే మాటలు కాదు. కనీసం 50 ఏళ్ల లోపన్నా కాదు అని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై సీరియస్ అయ్యాయి పలు వైద్య సంఘాలు సైతం. అసిస్టెంట్ రీప్రొడెక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) బిల్లు-2017 ప్రకారం 18 ఏళ్లలోపు.. 45 ఏళ్ల పైబడిన వారికి ఈ చికిత్స అందించడం నిషేధం అని పేర్కొన్నారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీ ప్రొడక్షన్, ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ రీప్రొడక్షన్ తదితర సంఘాల అధ్యక్షులు వ్యాఖ్యానించారు. 

ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున వైద్యరంగం నిపుణుల నుంచి విమర్శలు వస్తుండటంతో.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మకు చికిత్స అందించిన గుంటూరులోని అహల్య ఐవీఎఫ్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకుంది.. అహల్య ఐవీఎఫ్ సెంటర్ ఆదివారం తన నోటీసు బోర్డులో పేర్కొన్న వివరాలు చర్చనీయాంశమయ్యాయి. ఐవీఎఫ్‌ విధానానికి 45 ఏళ్లుపైబడి భార్య, 50 ఏళ్లు పైబడిన భర్తలను సెప్టెంబరు 2019 నుంచి తీసుకోబోమని పేర్కొంది. నూతన ఏఆర్‌టీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. దీంతో ఇకపై ఇలాంటి ప్రయోగాలు తాము చేయబోమని ఆ ఐవీఎఫ్ సెంటర్ చెప్పినట్లయింది. మొత్తానికి ప్రయోగం చేసి విజయం సాధించినా.. నిబంధనలకు విరుద్ధంగా ఉండటం.. ఆ దంపతుల వయసు రీత్యా.. ఇప్పుడు పుట్టిన పిల్లల భవిష్యత్ గురించి అంతా చర్చనీయాంశంగా మారింది.