Skip to main content
Latest News

‘అమ్మానాన్న విడిపోయారు.. అమ్మకు మరో పెళ్లి చేశాం..’

మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఆయనకు ఒకటా రెండా.. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్.. అది కూడా మామూలుగా కాదు.. అట్టర్ ప్లాప్.. ప్లాపుల్లోనూ రికార్డు క్రియేట్ చేశాయా సినిమాలు. మెగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. ఆ హీరో సినిమాలను కాపాడలేకపోయాయి.. ఆయన కెరీర్లో.. పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం మినహా మరో హిట్ సినిమా లేదు.. 2016లో వచ్చిన సుప్రీం సినిమా తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం (ఓ ముఖ్యపాత్ర), జవాన్, ఇంటిలిజెంట్, తేజ్.. అంటూ వరసబెట్టి సినిమాలు వచ్చాయి.. అవన్నీ ఫ్లాప్.. ఇక లాభం లేదని ట్రెండ్ మార్చి.. కథల ఎంపికలో జాగ్రత్త తీసుకున్నాడు సాయిధరమ్ తేజ్.. దీంతో తాజాగా వచ్చిన చిత్రలహరి సినిమా సాయిధరమ్ తేజ్‌కు కాస్త ఊరటనిచ్చింది. బ్లాక్‌బస్టర్ రేంజ్ కాకున్నా.. ఓ మోస్తరు హిట్‌ కొట్టాడు తేజ్.. దీంతో ఓ ప్రైవేటు మీడియా చానెల్‌కు తేజ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు తేజ్ గురించి తెలియని ఓ కొత్త విషయాన్ని వెల్లడించాడు.. 

తేజ్ పదో తరగతి చదివేటప్పుడే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారట.. తేజ్ తల్లిదండ్రుల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో 15 ఏళ్ల క్రితం వారు విడిపోయారట.. ఈ విషయాన్ని స్వయంగా ఇంటర్వ్యూలో తేజ్ వెల్లడించాడు. ‘అమ్మానాన్న విడిపోయాక ఆ లోటు తెలియకుండా నన్ను, తమ్ముడిని అమ్మ పెంచి పెద్ద చేసింది. నాన్నతో ఇప్పటికీ నాతో టచ్‌లోనే ఉన్నారు. నాన్న సినీ రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో ఆయనతో సినిమాల గురించి పెద్దగా మాట్లాడను. విడాకులు తీసుకున్నాక ఆయన హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంతూళ్లో ఉంటున్నారు..’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. నాన్న విడిపోయాక అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అయితే మా పెళ్లిళ్లు అయి మా లైఫ్‌లో మేముంటే అమ్మ ఒంటరిదయిపోతుందని తాము అనుకున్నామనీ.. అందుకే 2011లో అమ్మకు మరో పెళ్లి చేశామన్నాడు. ఎంతగానో బతిమిలాడి ఒప్పిస్తేనే అమ్మ మరో వ్యక్తిని పెళ్లాడేందుకు ఒప్పుకుందని వివరించాడు. అమ్మను పెళ్లాడిన వ్యక్తి కంటి డాక్టర్ అనీ.. తమతో బాగా క్లోజ్‌గానే ఉంటాడన్నాడు. ఆయన చాలా మంచివాడని, అమ్మను బాగా చూసుకుంటున్నారని చెబుతున్నాడు. తాను, తమ్ముడు, అమ్మ ఆయన.. అంతా కలిసి ఉంటున్నామన్నాడు.