Skip to main content
Latest News

మద్యం మత్తులో ఎన్డీ తివారి కొడుకు రోహిత్.. భార్యే హత్య చేసి..

కలకలం రేపిన ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ తివారి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వైవాహిక జీవితంలో రేపిన కలహాల వల్ల భార్య అపూర్వే రోహిత్‌ను చంపేసిందని పోలీసులు నిర్ధారించారు. మూడు రోజులుగా ఆమెను విచారిస్తూ.. కీలక విషయాలను రాబ్టారు. ముఖంపై దిండుతో ఒత్తి.. ఊపిరాడకుండా చేసి రోహిత్‌ను హత్య చేశారన్న అభియోగాలపై భార్య అపూర్వను  బుధవారం అరెస్ట్‌ చేశారు. పెళ్లైన మొదటి రోజు నుంచే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లికి ముందే ఆమెకు మరో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని విచారణలో తేలింది. అయితే ఆ ప్రియుడి పాత్ర ఈ హత్యలో ఏమీ లేదని కూడా స్పష్టమయింది. హత్య జరిగిన రోజు రాత్రి కొత్తగా ఇంట్లోకి ఎవరూ రాకపోవడం.. రోహిత్‌ది హత్యేనని పోస్ట్‌మార్టన్ రిపోర్ట్‌లో తేలడంతో కుటుంబ సభ్యుల పాత్ర ఉండి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమయింది. మద్యం మత్తులో రోహిత్ నిద్రపోతుండగా.. భార్య అపూర్వ.. అతడి ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత సహజ మరణమేనన్నట్లు ఆసుపత్రికి ఫోన్ చేసి డ్రామా ఆడింది. పోలీసులకు దొరక్కుండా 90 నిమిషాల్లో ఆధారాలన్నింటినీ మాయం చేసినట్లు విచారణలో స్పష్టమయింది. 

కాగా ఈనెల16న రోహిత్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టమ్‌లో నివేదికలో రోహిత్‌ది సహజ మరణం కాదని తేలడంతో రోహిత్ భార్య అపూర్వను వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించారు. పొంతనలేని ఆమె సమాధానాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ తల్లి ఉజ్వల స్పందిస్తూ రోహిత్‌, అపూర్వ దంపతుల మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. అంతేకాదు  అపూర్వ, ఆమె కుటుంబం, రోహిత్‌ ఆస్తిపై కన్నేసారని కూడా ఆమె ఆరోపించారు. రోహిత్‌తో వైవాహిక జీవితం పట్ల ఆమెకు సంతృప్తి లేదనే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని వాపోయారు.