Skip to main content
Latest News

టీడీపీ శిబిరంలోని వైసీపీ బాధితులను తరలించిన పోలీసులు

టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం పొందిన వారిని పోలీసులు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైసీపీ బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శిబిరం మరి కొద్ది రోజులు కొనసాగిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని స్వగ్రామాలకు తరలించారు. ఆర్డీఓ స్థాయి అధికారి వారి నుండి పూర్తి వివరాలు సేకరించారు. శిబిరానికి ఎందుకు వచ్చారు.. గ్రామంలో పరిస్థితి ఏంటి.. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. తిరిగి గ్రామానికి వెళ్లటానికి సిద్దమేనా..? అనే వివరాలు సేకరించి వారి గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేసారు. ముందుగా శిబిరంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.

వైసీపీ బాధితులకు అండగా ఉండేందుకు టీడీపీ బుధవారం ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చింది. అయితే, గుంటూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కారణంగా టీడీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో వైసీపీ సైతం టీడీపీ బాధితులను గుంటూరు తీసుకొచ్చింది. వారు సైతం ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. దీంతో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు తమను అడ్డుకోవటంతో ఈ కార్యక్రమం వాయిదా వేయటం లేదని.. తాము పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు నిర్వహిస్తామని.. అప్పటి వరకు శిబిరం కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించారు. దీంతో.. ముందుగా శిబిరంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. తరువాత అక్కడ ఆర్డీఓ స్థాయి అధికారి వచ్చి ప్రతీ బాధితుడి నుండి వివరాలు సేకరించారు. వారివారి కష్టాలను గురించి ఆరా తీశారు. సమస్యలను విన్నారు. ఆ తర్వాత వారి నుంచి సుముఖుత వ్యక్తం అయిన వెంటనే వారిని స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. గుంటూరు నుంచి పోలీసు రక్షణతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వారిని తరలించారు. ఆ సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online

Tags