Skip to main content
Latest News

కోడెల ఆత్మహత్యపై మొదటిసారి విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యతో ఏపీలో రాజకీయాలు మరింత వాడివేడిగా మారాయి. సోమవారం రోజు కోడెల తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు కోడెల మృతికి బాధ్యులు మీరంటే... మీరంటూ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కోడెల మృతిపై వైసీపీ ముఖ్య నేత, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల మరణవార్త తెలిసి కూడా మూడు రోజుల తర్వాత ఆయన మొదటిసారి ఈ ఉదంతంపై నోరు విప్పారు. విజయసాయి రెడ్డి ట్వీట్లతో చేసిన అవమానాల వల్లే కోడెల మరణించారని ఓ టీడీపీ సీనియర్ నేత ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో విజయసాయి రెడ్డి ఈ ఆరోపణలపై ఎట్టకేలకు పెదవి విప్పారు.

‘కోడెల గారి మరణాన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి ఆయన ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారు. తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను అనర్హులు చేయకుండా ఆయనను వాడుకుని వదిలేశాడు బాబు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు...’ అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పరోక్షంగా కోడెల మరణానికి చంద్రబాబే కారణమన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కోడెల మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటూ.. ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక సర్కస్ ట్రూపులా మార్చాడు. ఒక చోట టెంటు వేస్తాడు. జనం పోగవగానే షో మొదలవుతుంది. వచ్చిన వాళ్లంతా తనకు ఓట్లేసినట్టేనని హుషారై పోతాడు. సర్కస్‌ చూసి చప్పట్లు కొట్టిన వారు ఆ తర్వాత అది మర్చిపోతారని ఈయనకెప్పటికీ అర్థం కాదు...’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online