Skip to main content
Latest News

చంద్రబాబు అనంతపురం పర్యటనలో వైసీపీ మాస్టర్ స్కెచ్.. వ్యూహం బెడిసికొట్టింది..

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జగన్‌ పాలన రావణాసుర పాలనను తలపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పత్యాపురం గ్రామంలో మే 31న వైసీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన రాజు కుటుంబాన్ని చంద్రబాబు మంగళవారం పరామర్శించారు. ఆయన తాడిపత్రి నుంచి అనంతపురం మీదుగా బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామానికి సాయంత్రం చేరుకున్నారు. నేరుగా రాజు ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.  వారి కుటుంబ సభ్యులను, గాయపడిన అన్నదమ్ములను పరామర్శించారు. పరామర్శిస్తున్న సందర్భంలో సార్‌.. టీడీపీ కార్యక ర్తలమన్న ఉద్ధేశ్యంతో మాపై దాడి చేసి మా తమ్ముడిని వైసీపీ వారు పొట్టన పెట్టుకున్నాడని రాజు అన్నతోపాటు, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. మీరెవ్వరూ అధైర్యపడవద్దని అండగా నేనుంటానని, ఏకష్టమొచ్చినా ఆదుకునేందుకు మా నాయ కులుంటారని తెలిపారు. మీరు మా గ్రామానికి వస్తున్నారని తెలుసుకుని వైసీపీ కండువాలు కప్పుకోవాలని మాపై ఒత్తిడి తెచ్చారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మాకెన్ని కష్టాలొచ్చినా తెలుగుదేశం పార్టీ మారమని చచ్చేవరకు తెలుగుదేశంతోనే ఉంటామని తెలిపారు. దీంతో పరామర్శించబోయే కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుని.. చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టినట్లయింది. 

అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలు మంచి పాలన అందించాలని ఓటేశారని, అందరినీ చంపడానికి కాదని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిం చడంతగదన్నారు. ఆడపడుచులను బాధ పెట్టిన వారు పుట్టగతులు లేకుండా పోతారని ఆయన మండిపడ్డారు. కార్యకర్తలపై దాడులు చేస్తూ ఉంటే ఊరికే వదిలేది లేదని ఎక్కడైతే దాడి చేశారో ఆ గ్రామానికి వచ్చి అక్కడే నేనుండి నా కార్యకర్తలను కాపాడుకుంటానని పేర్కొన్నారు. గత ఐదు సంత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రశాంత పాలన అందించామని, ప్రస్తుతం వైసీపీ అందుకు విరుద్ధంగా ఫ్యాక్షన్‌, హత్యా రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. అభివృద్ధి పాలన మాదైతే, రావణాసుర పాలన మీదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలు తీర్చేందుకు పట్టిసీమను పూర్తి చేసి సాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. 

ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి బాటలో నడిపించామ న్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ కార్య కర్తలపై దాడులు చేయించేందుకే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినట్లు ఉందని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజలు తలచుకుంటే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిం చారు. ధర్మవరంలో కార్యకర్తలతో చర్చించి మీకు సరైన నాయకుడిని ఇన్‌చార్జ్‌గా నియ మిస్తామని, మీరు ఎవరూ అధైర్య పడొద్దని బాబు  కార్యకర్తలకు సూచించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇంచార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. 

మరిన్ని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి!