Skip to main content
Latest News

‘కోడెల అనే నీచుడు చనిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..’

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ స్పీకర్‌, మాజీ మంత్రి అయిన కోడెల శివ ప్రసాద్‌ మృతితో ఆ పార్టీ నాయకులు మరియు ఆయన కుటుంబ సభ్యులు శోకంలో మునిగి పోయారు. మరో వైపు ఆయన మృతిపై రాజకీయ దుమారం రేగుతోంది. ఏ వ్యక్తి చనిపోయినా, ఎంత శత్రువు చనిపోయినా కూడా ఎవరు కూడా సంతోషంగా ఉందని మాత్రం వ్యాఖ్యలు చేయరు. కానీ కోడెల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. కోడెల మరణించడం తనకు చాలా సంతోషకరమైన వార్త అంటూ ఓ నాయకుడు ప్రకటించి కలకలం రేపారు. ఆయనే వంగవీటి నరేంద్ర . వంగవీటి రంగా కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

వంగవీటి రంగా హత్య కేసులో అప్పటి హోంమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాదరావు కూడా ఓ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సాక్ష్యాలు ఏవీ లేకపోవడంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడ్డారు. అయినప్పటికీ కోడెల కనుసన్నల్లోనే వంగవీటి రంగా హత్య జరిగిందని.. ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కోడెల మరణంపై వంగవీటి రంగా కుటుంబానికి చెందిన వంగవీటి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల అనే నీచుడు చనిపోయినందుకు మేం చాలా సంతోషిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. వంగవీటి రంగా హత్యకు కారణమైన వ్యక్తి చనిపోయినందుకు తనతోపాటు వంగవీటి అభిమానులంతా ఆనందంగా ఉన్నారన్నారు. 

'30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి మోహనరంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని, ప్రజాప్రతినిధిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు. ఇప్పుడు చనిపోయిన కోడెలను కొన్ని మీడియా సంస్థలు ప్రజా నాయకుడని చెప్పుకుంటున్నాయి. ఇదే కోడెల, రంగా హత్య జరిగినప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు. కోడెల జిల్లా ఎస్పీ సాయంతో మూడు సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్‌తో చంపారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. రెక్కీ తర్వాత కెనాల్ గెస్ట్ హౌస్‌లో వాళ్లు మీటింగ్ పెట్టుకున్నారు. పోలీస్ శాఖలో వంగవీటి మోహనరంగాకు అనుకూలంగా ఉన్న 300 మందికిపైగా పోలీసులను వారం రోజుల ముందే బదిలీ చేశారు. ఇలా కుట్రపూరితంగా రంగా చావుకు కారణమైన ముఖ్యమైనవారిలో కోడెల ఒకరు. ఈ రోజు కోడెల శివప్రసాద్ అనే నీచుడు చనిపోయాడు. ఆయన చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం’ అని నరేంద్ర వ్యాఖ్యానించారు. రంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేని ప్రభుత్వం ఆయన్ను తుదముట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలోని రంగా విగ్రహం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులతో చేరుకుని ‘జోహార్ వంగవీటి రంగా.. జోహార్.. జోహార్’ అంటూ నినాదాలు ఇచ్చారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online