Skip to main content
Latest News

జగన్ బాటలో ఉపేంద్ర.. బెంగళూరులో జాబ్ చేస్తున్న తెలుగువారికి షాక్

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పుడు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా లాంటి అగ్ర దేశాలు సైతం స్థానిక మంత్రాన్నే జపిస్తున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు అన్న డిమాండ్ అన్ని దేశాల్లోనూ,రాష్ట్రాల్లోనూ పెరిగిపోతోంది. ఇటీవలే ఏపీ సీఎం జగన్ కూడా స్థానిక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని నిర్ణయించి.. జీవోను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. కేవలం ఏపీ వాసిని కానందున.. ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుబట్టింది. అయినప్పటికీ ఇదే నినాదాన్ని మరికొన్ని రాష్ట్రాలు, కొందరు నేతలు అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోనూ ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని హీరో ఉపేంద్ర డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పోరాటానికి సిద్దమని ప్రకటించిన ఆయన..ఈ నెల 14,15 తేదీల్లో నిరాహారదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. తన పోరాటానికి కర్ణాటక యువత మద్దతుగా నిలవాలని కోరారు.

ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ఆయ‌న విడుద‌ల చేసిన వీడియోలో ఏముందంటే..  ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను.  నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలపై సీరియస్‌గా ఫోకస్ చేసిన ఉపేంద్ర.. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న నినాదంతో పోరాటం మొదలుపెట్టనున్నారు. 

కాగా, కర్ణాటక రాజధాని బెంగళూరు దేశ ఐటీ రాజధాని కావడంతో అన్ని రాష్ట్రాల వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలవారి నుంచి పోటీ ఎక్కువ కావడంతో స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వారిలో ఏపీ, తెలంగాణ యువత భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండుతో ఉపేంద్ర పోరాటం చేయబోతుండటం గమనార్హం. ఈ నిబంధన కనుక అమలైతే.. లక్షలాది మంది తెలుగు యువత భారీగా నష్టపోవడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఐటీ రంగం అంతగా అభివృద్ధి చెందలేదు.. ఏపీ యువత హైదరాబాద్‌, బెంగళూరుల్లో ఎక్కువగా ఉఫాధి అవకాశాలను పొందుతున్నారు. హైదరాబాద్ కంటే బెంగళూరు వైపే ఆంధ్రా యువత మొగ్గు చూపుతోంది. ఈ తరుణంలో కన్నడిగుల నుంచి ఈ తరహా డిమాండ్ రావడంతో.. తెలుగు యువత గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విభజనతో ఐటీ ఉద్యోగాలకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను పోగొట్టుకుని.. మరో వైపు బెంగళూరులో కూడా నో ఛాన్స్ అంటే ఏం చేయాలా..? అని తల పట్టుకుంటున్నారు. 

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 
Telugu News Online