Skip to main content
Latest News

చంద్రబాబుకు మద్దతుగా.. జగన్‌కు కేంద్ర మంత్రి ఘాటు లేఖ..

జగన్ సర్కార్‌కు కేంద్రం మరోసారి ఝలక్ ఇచ్చింది.. పీపీఏల విషయంలో ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది. పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ.. ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు జగన్ ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి ఈ లేఖ రాయడం విశేషం.  టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ చేస్తున్న వాదనల్లోనూ నిజం లేదని తేల్చారు కేంద్రమంత్రి. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్‌కు సంబంధించి గతంలో ఖరారైన ధరలు అధికంగా ఉన్నాయన్న జగన్‌ ప్రభుత్వ వాదనలో నిజం లేదని, కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రలో ఇవి తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.

Read Also : రుణమాఫీ జీవోను కూడా రద్దు చేసిన జగన్.. మండిపడుతున్న రైతులు

 
‘పవన విద్యుత్‌ ధర 2016- 17లో మీ రాష్ట్రంలో ఒక యూనిట్‌ రూ.4.84 ఉంది. అదే సంవత్సరంలో రాజస్థాన్‌లో రూ.5.75, మహారాష్ట్రలో రూ.5.56, మధ్యప్రదేశ్‌లో రూ.4.78, గుజరాత్‌లో రూ.4.18గా ఖరారైంది. గాలి వేగం, భూమి ధర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి.. రాష్ట్రానికీ.. రాష్ట్రానికి ధరలు మారుతుంటాయి. అలాగే సౌర విద్యుత్‌ ధర 2014లో మీ రాష్ట్రంలో ఒక యూనిట్‌ రూ.6.75 ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.3కి తగ్గిందని మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోలార్‌ సెల్స్‌, మాడ్యూళ్లు, పరికరాల ధరలు తగ్గడం, టెక్నాలజీ మారడం వల్ల ఈ ధరలు తగ్గుతున్నాయి. నేటి ధరలతో గత ధరలను పోల్చిచూసి ఎక్కువగా ఉన్నాయనుకోవడం సరికాదు. పైగా సౌర, పవన విద్యుదుత్పత్తి యూనిట్లకు ఒకేసారి పెట్టుబడి పెట్టేస్తారు. థర్మల్‌ ప్లాంట్లకు ఏటా బొగ్గు తెచ్చి విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలి. ఈ తేడా గమనించండి’ అని ఆయన సూచించారు. 

‘ఆంధ్రప్రదేశ్‌ డిస్కంల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మాట వాస్తవమే. కానీ దానికి సౌర, పవన విద్యుత్‌ ధరలు కారణం కాదు. మీ డిస్కంలు ఉదయ్‌ పథకంలో చేరాయి. వాటి ప్రకారం.. 2016-17లో 3.6 శాతం, 17-18, 18-19ల్లో ఐదు శాతం చొప్పున కరెంటు చార్జీలు పెంచాలి. కానీ పైసా కూడా పెంచలేదు. నిబంధనల ప్రకారం చార్జీలను హేతుబద్ధం చేసుకోవాలని నా విజ్ఞప్తి. పవన విద్యుత్‌ రంగంలో మూడు కంపెనీలు గ్రీన్‌ కో, రెన్యూ, మైత్రాల వద్దనే అత్యధిక భాగం యూనిట్లు ఉన్నాయని మీరు ఫిర్యాదు చేశారు. దానిపై ఆ మూడు కంపెనీలు సమాధానం పంపాయి. అయితే ఏవేవో అపోహలతో.. అనుమానాలతో మొత్తం పీపీఏల పునఃసమీక్ష చేపట్టవద్దు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ఈ దేశంలో ఒకసారి కుదుర్చుకున్న ఒప్పందాలకు విలువ లేదన్న అభిప్రాయం వ్యాపిస్తే పెట్టుబడులు రావు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిని భారీగా పెంచాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’ అని ఆర్కే సింగ్ తెలిపారు.

కాగా.. కేంద్రం రెస్పాన్స్‌తో జగన్ సర్కారుపై మరోసారి రెచ్చిపోయారు. ట్విటర్ వేదికగా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘కేంద్రం చివాట్లు, కోర్టుల మొట్టికాయలు ఏవైనా, వైసీపీ వాళ్ళకు దున్నపోతుమీద వాన చినుకులు పడినట్టే. పీపీఏల రద్దుపై కేంద్ర మంత్రి లేఖలు, కేంద్ర కార్యదర్శి లేఖలు, ఆర్ బీఐ, అప్పిలేట్ ట్రిబ్యునల్, పీఎంవో, విదేశీ ఎంబసీల సహా ఎందరు హెచ్చరికలు చేసినా అన్నింటినీ పెడచెవిన పెట్టారు. ఇప్పుడు తాజాగా పీపీఏల రద్దుపై ప్రభుత్వాన్ని మూర్ఖంగా ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ కేంద్రమంత్రి ఆర్ కే సింగ్ లేఖ రాశారు. 3కంపెనీలకు తెలుగుదేశం ప్రభుత్వం దోచిపెట్టిందన్న వైసీపీ నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రుజువులతో సహా ఆ లేఖలో తెలిపారు. ఆర్ పీవో పైన, ధరలపైన, గ్యాస్ కేటాయింపులపైన, మస్ట్ రన్ పైన ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని ఆరోపణలు చేసిన అధికారులు ఇప్పుడేమంటారు? వాళ్లను ముందుపెట్టి జగన్నాటకం ఆడించిన వాళ్లేమంటారు?. నిన్న హైకోర్ట్ జీవో 63ని కొట్టేయడం ఒక చెంపపెట్టు. ఈ రోజు కేంద్రమంత్రి ఆర్ కే సింగ్ లేఖ మరో చెంపపెట్టు. రోజురోజుకూ, పూటపూటా చెంపదెబ్బలు పడుతున్నా వైసీపీ నేతల్లో ఏమాత్రం మార్పురాదు ’అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online