Skip to main content
Latest News

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ.. మా గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ..

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు కొంతకాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ గ్రామాలను తెలంగాణలో విలీనం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు మహారాష్ట్ర రైతులు ఉద్యమబాట పట్టారు. నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు. ఈ విషయమై మాట్లాడేందుకు వచ్చిన ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులను మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ కలిశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో కేసీఆర్‌కు విన్నవించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీఎంని కలిసిన వారిలో నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. త్వరలోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి, శివసేన, ఎన్సీపీ పార్టీలకు చెందిన స్థానిక నేతలతో వచ్చి సీఎం కేసీఆర్‌ని కలుస్తామని చెప్పారు. నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్నినియోజకవర్గాల ప్రజలతో పాటు బీవండి, షోలాపూర్, రజూర ప్రాంతాల నుంచి టిఆర్ఎస్ టికెట్ కావాలని అడుగుతున్నట్లు వారి వెల్లడించారు. ఐతే మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, రైతుల విజ్ఞప్తిని విన్న కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో టీఆర్ఎస్ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పిన్నట్లు సమాచారం.

తమ గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయని తెలిపారు. కానీ తమ గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉందని చెప్పారు. ‘‘తెలంగాణలో రైతులు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మేమంతా బాధల్లో ఉన్నాం. తెలంగాణలో రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల సహాయం అందుతోంది. మా గ్రామాల్లో ప్రభుత్వం రైతులకు ఇలాంటి సాయమేదీ చేయడం లేదు. తెలంగాణలో రైతు బీమా అమలవుతోంది. మహారాష్ట్రలో లేదు. తెలంగాణలో పేదలకు రూ.2 వేల పెన్షన్‌ వస్తోంది. మా రాష్ట్రంలో కేవలం రూ.600 వస్తోంది. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందుతోంది. తెలంగాణలో కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, పండుగలకు దుస్తుల పంపిణీ లాంటి పథకాలు మహిళలను ఎంతో ఆదుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి పథకాలు లేవు. తెలంగాణలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా దగ్గర అధ్వానంగా ఉన్నాయి’’ అని వాపోయారు. నిజాం కాలంలో తామంతా హైదరాబాద్‌ రాజ్యంతోనే ఉన్నామని, ఇప్పటికీ నిజాం ఖాస్రాపాణీలతోనే భూ రికార్డులు సరిచూసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి, తమ గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలని అక్కడి ప్రజలు కోరుకోవడం సహజమని కేసీఆర్‌ అన్నారు. ఆయా గ్రామాల సమంజసమైన కోరికను మహారాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని మహారాష్ట్ర నాయకులకు కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online