Skip to main content
Latest News

పరిటాల రవి నుంచి.. కోడెల వరకు.. వరుస దుర్మరణాలతో టీడీపీలో టెన్షన్

తెలుగుదేశం పార్టీ... తెలుగునాట రాజకీయ చరిత్రను ఓ మలుపుతిప్పిన పార్టీ. 1983లో అన్న నందమూరి తారకరామారావు చేతుల మీదుగా ఏర్పాటయిన పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ నూతన శకాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ రాకతో అభివృద్ధిలో ఏపీ కొత్త పుంతలు తొక్కిందన్న దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది మేధావులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు.. ఎన్టీఆర్ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీలోనైనా, నేడు తెలంగాణలోనైనా ఇప్పుడున్న మెజార్టీ నేతలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే.. ఎన్నో సంక్షోభాలు ఎదురైనా, ఢిల్లీ పార్టీ టీడీపీని నాశనం చేయాలని చూసిన ఆంధ్ర ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అధికారాన్ని కట్టబెట్టి ఆదరించారు. అప్పుడు ఎన్టీఆర్.. ఆ తర్వాత చంద్రబాబు.. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ స్వార్థాన్ని చూసుకోలేదు. పార్టీ మేలుతోపాటు.. రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించారు. 

1989లో ఎన్టీఆర్ ఓడిపోయి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా.. ఆ తర్వాత 2004లో ఓటమి పాలయి.. 2014 వరకు టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్, వైఎస్ ఒత్తిళ్లను తట్టుకుని ధీటుగా నిలబడిందీ తెలుగుదేశం పార్టీ.. తెలంగాణ సంక్షోభంతో ఆ రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగవుతోంది. నేతలంతా పార్టీలు మారినా.. అభిమానులు మాత్రం కోకొల్లలు. దానికి కారణం ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. పార్టీ కోసమే, కార్యకర్తల కోసమే పనిచేసే సీనియర్ నేతలు.. ఎన్టీఆర్ హయాంలో పార్టీలో చేరి.. నేటికీ పార్టీ కోసమే పనిచేస్తున్న నేతలు.. కానీ పాత తరం కనుమరుగవుతోంది.. ఒక్కొక్కరుగా నేతలు నేలరాలిపోతున్నారు. రాజకీయ కక్షల్లో కొందరు చనిపోతే.. రోడ్డు ప్రమాదాల్లో మరికొందరు మరణిస్తున్నారు. వరుసగా టీడీపీ సీనియర్ నేతల దుర్మరణాలు.. ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. 

తాజాగా.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గతంలో కడ‌ప జిల్లాలో మంచి ప‌ట్టున్న నేత శివారెడ్డి. ఎన్టీఆర్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో జ‌రిగిన వివాహ వేడుక‌కు వ‌చ్చిన ఆయ‌న‌ను బాంబుల‌తో ప్ర‌త్య‌ర్థులు హ‌త‌మార్చారు. 1994 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ త‌ర్వాత తెలంగాణ‌లో మంచి ప‌ట్టున్న నేత‌ నల్లగొండకు చెందిన ‘మాధవరెడ్డి’ని నక్సల్స్‌ హతమార్చారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అదే విధంగా ఎదుగుతున్న మరో నేత దేవినేని రమణ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడే ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇలా కీల‌క నేత‌ల మ‌ర‌ణాల‌తో ఆయా ప్రాంతాల్లో టీడీపీకి తీర‌ని న‌ష్టం జ‌రిగింది. పార్టీ కోలుకోలేక‌పోయింది.

ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన బాల‌యోగి టీడీపీలో అత్యున్న‌త స్థాయికి ఎదిగారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘ‌ట‌నతో పార్టీ శ్రేణులు దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయారు. 2005 అసెంబ్లీ ఎన్నికల తరువాత అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవి హత్య క‌ల‌క‌లం రేపింది. పార్టీ కార్యాలయంలోనే ఆయనను ప్రత్యర్థులు హతమార్చారు. ప‌రిటాల ర‌వి మ‌ర‌ణంతో అనంత‌పురం జిల్లాలో పార్టీ ప‌ట్టుకోల్పోయింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌నేత ‘ ఎర్రంనాయుడు ‘, గుంటూరు జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత ‘ లాల్‌జాన్‌భాషా ‘, మాజీ మంత్రి, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్య కారణాలతో మరణించారు. ఎన్టీఆర్‌కు ఎంతో ఆప్తుడైన దేవినేని నెహ్రూ కూడా మరణించారు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన సీనియర్ నేత ఎంవీఎస్ మూర్తి మరణించారు. ఇటీవల మంగళగిరికి చెందిన టీడీపీ నేత ఉమా యాదవ్‌ను రాజకీయ ప్రత్యర్థులు అంతమొందించారు. తాజాగా కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంద‌రూ కూడా పార్టీలో ప‌ట్టున్న నేత‌లు. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందిన‌వారు. ఇలా అర్ధాంత‌రంగా ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ కోలుకోలేక‌పోతోంది. భవిష్యత్‌లో వైసీపీ ఒత్తిళ్లకు ఎంతమంది నేతలు నేలరాలుతారోనన్న భయంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో నేతలు రాజకీయ కక్షలకు బలయితే.. వందల సంఖ్యలో కార్యకర్తలు కూడా పార్టీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. వీరందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఆర్థికంగా, వారి పిల్లల చదువులకు అండగా ఉంటున్నా.. వ్యక్తిగతంగా ఆయా కుటుంబాలకు కోలుకోలేని దెబ్బే. మరి భవిష్యత్‌లో టీడీపీ వైసీపీ ఒత్తిళ్లను తట్టుకుని ఎలా నెగ్గుకు వస్తుందో.. చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను రచిస్తారో వేచిచూడాలి. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online