Skip to main content
Latest News

టీడీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ అన్నం సతీష్ గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్‌. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ రాజీనామా చేసారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న బాప‌ట్ల నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్ది కోన ర‌ఘుప‌తి చేతిలో ఓడిపోయారు. అప్ప‌టి నుండి ఆయ‌న పార్టీలో అంత యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. ఇటీవల ఆయ‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉండే రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి బీజేపీలో చేర‌టంతో అప్ప‌టి నుండి స‌తీష్ సైతం వెళ్తార‌నే ప్ర‌చారం సాగింది. బుధవారం స‌తీష్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటుగా టీడీపీకి రాజీనామా చేసారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి బీజేపీలో చేరటంతో ఆయన ద్వారా అన్నం సతీష్‌ కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రజాతీర్పును గౌరవించి ఎన్నికల్లో ఓటమి అనంతరం శాసనమండలిలో ప్రవేశించేందుకు ఆత్మప్రబోధం అంగీకరించని కారణంగా గురువారం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు అన్నం సతీష్‌ ప్రకటించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు లేఖ పంపిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యునిగా ఉన్న అన్నం సతీష్‌ రాజీనామా ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నం సతీష్‌ 2014లో బాపట్ల టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికలలో ఓటమిపాలైనప్పటికీ అధిష్ఠానం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు 2019 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని పార్టీ అధిష్టానంపై అప్పట్లో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ అధినేత చంద్రబాబు మాత్రం బాపట్ల టికెట్ సతీష్‌కే ఇచ్చారు. రెండోసారీ ఓటమిపాలైన అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఫలితాలు వెల్లడైన నాటి నుంచి పార్టీ శ్రేణులకు, నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు స్థానికంగా ప్రచారం చేస్తున్నారు.