Skip to main content
Latest News

జనసంద్రమైన పల్నాడు.. పాదయాత్ర చేసి నివాళి అర్పించిన చంద్రబాబు

కోడెల శివప్రసాద్ అంతిమయాత్రలో వేలాది మంది జనం పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంత జనం కోడెలకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. తమతో కోడెలకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. నియోజకవర్గం కోసం ఎంతో చేశారని కీర్తిస్తున్నారు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఉబికివస్తోన్న కన్నీరును ఆపుకొని అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ శ్రేణులు వెంటరాగా ... భారమైన హృదయంతో కోడెల శివప్రసాద్ అంతిమయాత్ర కొనసాగుతుంది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్, ఎస్పీ జయలక్ష్మి టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. అందుకు కోడెల కుటుంబీకులు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.

కోడెల శివప్రసాద్ అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ కేశినేని నాని, అచ్చెన్నాయుడు, బుద్ధా వెంకన్న, బోండా ఉమ, దేవినేని ఉమా , ఎంపీ గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుతోపాటు పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ అంతా ఇక్కడే ఉందా..? అన్నట్లుగా నేతలంతా హాజరయ్యారు. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్రగా కోడెల అంతిమయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంతిమయాత్ర వాహనం ముందు కదలిరాగా .. మిగిలిన నేతలు, టీడీపీ శ్రేణులు, నరసారావుపేట స్థానికులు బరువెక్కిన హృదయంతో కదలి వస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం కోడెల శివప్రసాద్ పార్థీవదేహం ఉన్న వాహనంలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కోడెల శివప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని బాలయ్య చాటి చెప్పారు. రాజకీయంగానే గాక వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ముఖ్యంగా బసవతారం ఆస్పత్రి ఏర్పాటు చేశాక కోడెల శివప్రసాద్ పాత్ర మరవలేనిది. తొలుత ఆయనే చైర్మన్‌‌గా విధులు నిర్వర్తించారు.

ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో నరసరావుపేట చేరుకుంటున్నారు. కోడెలను కడసారి చూసేందుకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి ఆయన అభిమానులు కోడెల నివాసానికి చేరుకుంటున్నారు. కోడెలను చివరిసారి చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు క్యూలైన్లలో బారులుదీరారు. పెద్దఎత్తున తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కోట సెంటర్ జనసంద్రంగా మారింది. కోడెల అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడెల నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో బంద్ పాటించనున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online