Skip to main content
Latest News

‘నా కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా.. నేను చంద్రబాబు మాట విన్నా..’

ఏపీలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక వ్యక్తులందరూ టీడీపీని వీడగా.. తాజాగా మరో మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేశారు. ఇటీవలే చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి సుమారు గంటసేపు భేటీ అయ్యారు. ఆ భేటీలో.. జమ్మలమడుగులో తన అనుచరులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో బీజేపీలో చేరడమే ప్రత్యామ్నాయం అని ఆది నారాయణ రెడ్డి చంద్రబాబుతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి ద్వారా పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే, అది సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో అక్కడ బీజేపీని బలోపేతం చేయడం అంత ఈజీ కాదని భావించి ఆదినారాయణరెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు వ్యూహరచన చేసినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే మంచి ముహూర్తం చూసుకుని బీజేపీలో చేరాలని ఆది నారాయణరెడ్డి భావిస్తున్నారు. కాగా ఇదే విషయమై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడి.. టీడీపీలోకి రావడం.. ఆ తర్వాత మంత్రి అవడం.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘దేశ సేవ, సొంత ప్రాంత అభివృద్ధి కోసం బీజేపీలో చేరుతున్నా. రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు కేంద్ర పథకాల నిధులతో జమ్మలమడుగు నియోజవర్గంతోపాటు కడప జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాను. ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడింది నిజమే. ఇక టీడీపీలో కొనసాగలేనని చెప్పేసి వచ్చా. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజల ఆలోచన మారడం కొంత బాధించింది. గత ఎన్నికల్లో ఆర్థిక విషయాలన్నీ పార్టీయే చూసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆర్థికంగా ఏమాత్రం తన గెలుపు కోసం పార్టీ సహకరించలేదు. కడప లోక్‌సభ పరిధిలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగలేదనీ ఎంత చెప్పినా అధిష్టానం వినలేదు. ఒక్క పులివెందులలో మాత్రం సాహసం చేశారు. మిగిలినవారెవ్వరూ ఎన్నికల సమయంలో సరిగా డబ్బు ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ ప్రధానంగా నా ఓటమికి కారణాలయ్యాయి. చంద్రబాబును కలిసినప్పుడు నేను బీజేపీలో చేరుతానని చెప్పాను. గతంలో నా కుటుంబం వద్దన్నా చంద్రబాబు మాటకు విలువిచ్చాను. నేను డబ్బు, లెక్క చూసుకుంటాను అని నా వ్యతిరేకులు ప్రచారం చేస్తుంటారు. టీడీపీలో మంత్రిగా పనిచేసి ఏం డబ్బు కూడబెట్టుకున్నాను..? కేసులు రాజీ పడమన్నారు.. పడ్డాను. చంద్రబాబు ఎంపీగా పోటీ చేయమంటే పోటీ చేశాను. చివరకు ఎంతో నష్టపోయి ఇబ్బందులు పడ్డాను. త్వరలో అనుచరులతో సమావేశమై మంచి తేదీ నిర్ణయించుకుని బీజేపీలో చేరడం ఖాయం’.. అంటూ ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీలో చేరడం ద్వారా తనకు మంత్రి పదవి లభించడం తప్ప.. ఆర్థికంగా ఏ లాభం జరగలేదనీ.. ఇంకా తానే నష్టపోయానని చెప్పారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online