Skip to main content
Latest News

ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు వెళ్తే.. చింతమనేని అరెస్ట్..

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై ఉన్న కేసుల కారణంగా చింతమనేని గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు చింతమనేని ఇంటి వద్ద భారీ స్థాయిలో మోహరించారు. కాగా అంతకుముందు తాను ఎస్పీ ఆఫీసుకు వస్తున్నానని, అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకోవాలని చింతమనేని సూచించారు. 

పినకిడిమిలో అట్రాసిటీ కేసు నమోదు కావడంతో, గత కొద్ది రోజులగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. దళితుడిపై దాడి కేసులో చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించారు. బుధవారం దుగ్గిరాలలోని ఆయన నివాసంలో పోలీసులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. తనపై కేసు పెట్టడంతో బెయిల్ కోసం కోర్టుకు వెళ్లానని చెప్పిన చింతమనేని.. టీడీపీ నేత సూచనతో ఆర్టీసీ డ్రైవర్‌కు క్షమాపణలు చెప్పానన్నారు. గత వంద రోజుల్లో తానెప్పుడూ ఇంటి నుంచి బయటకు రాలేదన్నారు. ఎస్పీ ఆఫీసుకు తానే స్వయంగా వెళ్లి లొంగిపోతానని చెప్పారు. ఈ రోజు హైకోర్టు తన రిట్ పిటిషన్‌ను విచారిస్తోందనే విషయాన్ని గుర్తు చేశారు. తనపై కేసు నమోదైన పినకిడిమి గ్రామానికి వెళ్లి.. ఆ రోజు ఏం జరిగిందో గ్రామసభ పెట్టి విచారించుకోవచ్చని చింతమనేని సూచించారు. ‘‘నేను తప్పు చేసినట్టు రుజువైతే.. నా ఆస్తి మొత్తం రాసిస్తా. మరి బొత్స చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని చింతమనేని ప్రశ్నించారు. చింతమనేని భార్య రాధ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసుల దౌర్జన్యాల కారణంగానే ఆమె అనారోగ్యానికి గురయ్యారని చింతమనేని అనుచరులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online