Skip to main content
Latest News

‘బీజేపీలో టీడీపీ విలీనం.. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు’

‘‘మేమే బీజేపీతో తాళి కట్టించుకుంటాం... బీజేపీతో మళ్లీ కలిసి పనిచేస్తాం... త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం అవుతుంది’’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమన్నారు. ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జేసీ సోదరులు పార్టీ మారుతున్నట్లు ‘అనంత’లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దల నుంచి తనకు మంచి ఆఫర్‌ వచ్చిందని ఇటీవలే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో అన్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి చంద్రబాబు అవసరమన్నారు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదని గొప్ప ఆర్థికవేత్తని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించిన మరుసటి రోజే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఓటమి తరువాత అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాము పార్టీ మారే ఆలోచన లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి... ఏకంగా టీడీపీనే బీజేపీలో విలీనమవుతుందని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ రకమైన వ్యాఖ్యలు జేసీ దివాకర్ రెడ్డి చేస్తుంటారు. కానీ ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మొత్తానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకే ఈ రకమైన కామెంట్స్ చేశారా లేక మరో ఆలోచన ఉందా అన్నది చూడాలి.