Skip to main content
Latest News

‘టీడీపీ వాళ్లు కౌన్ కిస్కా గొట్టంగాళ్లు.. వాళ్లకు భయపడొద్దు..’

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీకి చెందిన కోన్ కిస్కా గొట్టాం గాళ్లు వాలంటీర్ వ్యవస్ధపై పిటిషన్లు వేస్తే భయపడకండంటూ వాలంటీర్లకు భరోసా ఇచ్చారు. ముందు తాను ఆముదాలవలస ఎమ్మెల్యేనని... ఆ తర్వాతే స్పీకర్‌రనని అంటూ ఆవేశంగా ప్రసంగించారు. స్పీకర్ రివ్యూలు చేయకూడదంటూ కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతున్నారని, తనను గెలిపించిన ప్రజలకు సమస్యలు వస్తే ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్‌గా తనకు విశేష అధికారాలున్నాయన్న విషయాన్ని తనపై విమర్శలు చేసే నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలన్నారు. శాసన సభలో సామాజిక న్యాయంతో చట్టాలు చేసే దమ్మున్న వ్యక్తి జగన్ అని ఆయన కితాబిచ్చారు. 

‘‘మీపై ఆరోపణలు వచ్చాయని ఎవడో టీడీపీవాడు, కోన్‌కిస్కాగొట్టంగాడు పిటిషన్లు వేస్తే మీరేమీ భయపడవద్దు. ధైర్యంచేసుకొని వెళ్లండి. మీ వెనుక నేనున్నాను. మీరు జగన్మోహన్‌రెడ్డి ప్రతినిధులు. మీరు పనిచేయండి. మీ వెనుక మేం ఉంటాం. ఎవడో ఏదో అంటే మీరు భయపడాల్సిన పనిలేదు. మేమేమీ జన్మభూమి కమిటీ సభ్యుల్లా అర్హత లేనివారికి ఇవ్వలేదు కదా.. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు భక్షకభటులైతే, ఈ ప్రభుత్వంలో వలంటీర్లు రాష్ట్ర ప్రజల రక్షక భటులు. గ్రామ వలంటీర్ల వ్యవస్థ పనితీరును ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తుంటారు. పేస్కేలు వరకూ ఉద్యోగభద్రత కలిగేలా చూస్తానని భరోసా ఇస్తున్నా’’ అంటూ తమ్మినేని సీతారాం ఆవేశంగా ప్రసంగించారు. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీపీఎస్సీ, ఎక్సైజ్‌, డీఎస్సీ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తన విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని, ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయనని స్పష్టం చేశారు.

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online