Skip to main content
Latest News

హుజూర్‌నగర్‌లో కిరణ్ రెడ్డి పోటీ చేస్తారు.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త వివాదం మొదలైంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే, తన సతీమణి పద్మావతి పేరును టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాతో సమావేశమైన రేవంత్ రెడ్డి... ఉత్తమ్ ఏకపక్షంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కు ఈ అంశంలో షోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కుంతియాను కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని కుంతియా రేవంత్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తానేమే పోటీ చేయబోనని, తమ పార్టీ తరపున అభ్యర్థిగా స్థానిక నేత అయిన చామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్‌ ప్రకటించారు. పద్మావతి పేరు ప్రకటనపై ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను వివరణ కోరాలని రేవంత్‌ సూచించినట్లు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి 14 రోజుల కంటే తక్కువ రోజుల బడ్జెట్ సమావేశాలు జరిగితే బడ్జెట్ చెల్లదని అన్నారు. ఈ విషయం అసెంబ్లీ రూల్స్ బుక్‌లోనే ఉందని అన్నారు. విద్యుత్‌పై సభలో చర్చ జరిగే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం సరికాదని అన్నారు. యురేనియం సమస్యపై టీడీపీలో ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తున్నానని రేవంత్ రెడ్డి... దీనిపై సంపత్‌కు అవగాహన లేదని అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అందిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హూజుర్ నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో హూజుర్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచే సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత గానీ.. గత ఎన్నికల్లో పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డిని కానీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో దింపాలన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన భార్య పోటీ చేస్తుందని ఉత్తమ్ ప్రకటించడంపై రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online