Skip to main content
Latest News

జమ్మూలో ఆంక్షల ఎత్తివేత.. కశ్మీర్‌లో మాత్రం..

జమ్మూ ఆంక్షలు ఎత్తివేశామని, కశ్మీర్‌లో కొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని జమ్మూకశ్మీర్‌ అడిషనల్‌ డీజీపీ మునీర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. జమ్మూలో పాఠశాలలు, ఇతర సంస్థలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయని తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాము పంద్రాగస్టు వేడుకలపై దృష్టి నిర్వహించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ వేడుకలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శాంతియుతంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. శ్రీనగర్‌ లాంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదన్నారు. 

కొంతమందికి స్వల్ప గాయాలవ్వగా వారికి వెంటనే చికిత్స అందజేసే ఏర్పాట్లు చేశామన్నారు. సామాన్య ప్రజలకు ఎటువంటి హాని కలగొద్దన్న లక్ష్యంతోనే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు. అనేక మంది ఇక్కడి శాంతిభద్రతలపై వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలో 2016, 2010 నాటి ఉద్రిక్త పరిస్థితుల వీడియోలు, చిత్రాలను వ్యాప్తి చేస్తున్నారు. అటువంటి అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నకిలీ వార్తల్ని నియంత్రించడానికి ప్రభుత్వం సైతం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. కశ్మీర్‌పై కీలక నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్రం భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవల్ని నిలిపివేశారు. ప్రముఖ రాజకీయ, వేర్పాటువాద నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా భారీ ప్రదర్శనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ దశలవారీగా ఆంక్షల్ని సడలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా పరిస్థితులు మెరుగవడంతో జమ్ములో ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేశారు. శ్రీనగర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు ఆంక్షల్ని కొనసాగించనున్నారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online