Skip to main content
Latest News

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి గుస్సా.. నివేదిక ఇవ్వాలని ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాసింది. ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో పలు సాంకేతిక, మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితంగా పలువురు విద్యార్థులు తప్పడం, కొందరికి మార్కులు తగ్గడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆయా విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. 27 మంది విద్యార్థుల పూర్తి వివరాలను భాజపా నేతలు తాజాగా రాష్ట్రపతికి పంపించారు.

తీవ్ర మానసిక వేదన కలిగించడం ద్వారా ప్రభుత్వ సంస్థలే అమాయక విద్యార్థుల జీవించే హక్కును హరించి వేశాయని, అయినా, ఏమీ జరగలేదంటూ ప్రభుత్వం తేల్చేసిందని వివరించారు. రాష్ట్రపతి జోక్యాన్ని కోరడం తప్ప తమకు మరో మార్గాంతరం లేకపోయిందని పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యలు, అందుకు దారి తీసిన పరిస్థితులపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నామని, ఈ మేరకు గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను ప్రస్తావించింది. కమిటీ అంత స్పష్టంగా నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎవరిపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కాగా.. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాలు తప్పుల తడకలుగా వెలువడిన విషయం తెలిసిందే. మెరిట్‌ విద్యార్థులు కూడా ఫెయిలయ్యారు. వారిలో కొందరికి సున్నా మార్కులు కూడా వచ్చాయి. ఫలితాలతో మనస్తాపానికి గురై వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్‌ బోర్డుకు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థదే తప్పంటూ అప్పట్లో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే, విచారణకు ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు జరిగాయని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. వేల మంది విద్యార్థుల విషయంలో వివిధ స్థాయుల్లో తప్పులు జరిగాయని స్పష్టం చేసింది. కొంతమంది విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లను బబ్లింగ్‌ చేయడంలో తప్పు జరిగితే.. మరికొందరి విషయంలో మెమోల్లో తేడాలు వచ్చాయని తెలిపింది. ఇంకొందరి విషయంలో కోడింగ్‌, డీకోడింగ్‌లలో తప్పులు జరిగాయని తేల్చింది. ఇందుకు ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థ.. రెండింటిదీ తప్పు ఉందని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాల వల్లే తప్పులు జరిగాయని, వీటిని బోర్డు, గ్లోబరీనా సకాలంలో గుర్తించలేకపోయాయని ఆక్షేపించింది. ఇంటర్‌ బోర్డుకు సాంకేతిక సహకారాన్ని అందించిన గ్లోబరీనా సంస్థకు లోపాలను సరిదిద్దే వ్యవస్థ లేదని తప్పుబట్టింది.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online