Skip to main content
Latest News

తోట త్రిమూర్తులు ఎప్పటికీ నాకు శత్రువే.. బాంబు పేల్చిన పిల్లి సుభాస్ చంద్రబోస్

‘తోట త్రిమూర్తులు నిన్నా, ఈరోజు, రేపు కూడా నాకు శత్రువే. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో జగన్ ప్రభుత్వం దళితుల పక్షమే వహిస్తుంది. వైసీపీ స్థాపించినప్పట్నుంచి దళితులే పార్టీకి అండగా ఉన్నారు. దళితులను మేం వదులుకోం. ఈ కేసులో ఏదైనా తేడా జరుగుతుందేమో..? అందుకే బాధిత దళితులను ముఖ్రమంత్రి వద్దకు తీసుకువెళతాను. అవసరం అయితే దళితులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసేందుకైనా నేను సిద్దమే. పార్టీలోకి ఎందరో వస్తుంటారు.. పోతుంటారు.. మాకు దళితులే ముఖ్యం’ .. ఇదీ ఏపీ ఉప ముఖ్యమంత్రి.. వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన వ్యాఖ్యలతో ఆ పార్టీలో కలకలం రేగుతోంది. ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ‘వెంకటాయపాలెం శిరోముండనం’ కేసు ఇప్పటికీ వీరిద్దరి మధ్య రాజకీయ వైరానికి కారణమవుతోంది. వైసీపీలో తోట చేరికతో ఇద్దరి మధ్య శతృత్వం ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ కేసు విషయంలో మాత్రం తాను వెనక్కు తగ్గేది లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చిచెబుతున్నారు. ఇంతకీ 23 ఏళ్ల క్రితం నాటి ఆ వెంకటాయపాలెం శిరోముండనం కేసు పూర్వపరాలేంటంటే..

‘1996 డిసెంబర్ 29న వెంకటాయపాలెం గ్రామంలోని దళిత యువకులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలకు అప్పటి, ఇప్పటి శాసన సభ్యుడు తోట త్రిమూర్తులు, అతని అనుచరులు శిరోముండనం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు అయింది. అయితే ఆనాటి నుంచీ నిందితుల్ని ప్రభుత్వం అనేక విధాలుగా కాపాడుకొస్తుంది. ఈ అమానవీయ సంఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయినప్పటికీ కేసు విచారణలో ఏ విధమైన పురోగతి లేదు. అప్పటి అధికారంలోని తెలుగుదేశం ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌చే ముద్దాయిలకు బెయిలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పించింది. ఎఫ్‌ఐఆర్ నమొదు అయిన 15 రోజులలోనే చార్జిసీటు దాఖలు చేసి ముద్దాయిలకు బెయిలు ఇప్పించబోయింది. ప్రభుత్వ చర్యని గమనించిన న్యాయమూర్తి కేసు విచారణను 27-05-1997 నుంచి 04-06-1997 వరకు షెడ్యూల్‌ని ఇచ్చారు. కేసు విచారణ జరిగితే శిక్ష తప్పదనుకున్న తోట త్రిమూర్తులు న్యాయమూర్తిపై తనకు నమ్మకం లేదని హై కోర్టు నుంచి స్టే తెచ్చుకుని విచారణని నిలిపివేయించాడు. విశాఖపట్నం ప్రత్యేక కోర్టుకి కేసుని బదిలీ చేయించుకున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 1997 ఏప్రిల్ లో జస్టిస్ కె.ఎస్. పుట్టుస్వామి కమీషన్‌ని నియమించింది. కమీషన్ ప్రయోజనాన్ని పసిగట్టిన బాధితులు కమీషన్‌ని బహిష్కరించారు. 1998 మేలో విశాఖపట్నం ప్రత్యేక కోర్టులో విచారణ మొదలయింది. ప్రధాన సాక్షులు కోటి చినరాజు, దడాల వెంకటరట్నంలు జరిగిన సంఘటనని కోర్టులో కళ్ళకి కట్టినట్టు చెప్పారు. దీనితో తోట త్రిమూర్తులు, అతని అనుచరులు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయకుండా ఆ మరుసటి రోజునే హై కోర్టు నుంచి కేసు విచారణపై స్టే తెచ్చుకున్నారు. ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తులుపై కేసు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 1796/1998 జారీ చేసింది. 

ఈ జీవోపై పౌర హక్కుల సంఘం, బాధితుడు దడాల వెంకటరత్నం హై కోర్టుని ఆశ్రయించారు. ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. కాంగ్రెస్ పదేళ్ళ ప్రభుత్వ పాలనలో ఈ కేసుకు ప్రత్యేక పీపీ రఫీ అహ్మద్ కిద్వాయ్‌ని నియమించింది. దీనిపై ముద్దాయిలు హై కోర్టుకు వెళ్ళి విచారణని సాగదీశారు. ప్రత్యేక పీపీ మధ్యలోనే విరమించుకున్నాడు. తర్వాత జవహర్ ఆలీని రెండో పీపీగా నియమించారు. విశాఖపట్నం ప్రత్యేక కోర్టు కేసు విచారణకి 05-08-2016 నుంచి 11-08-2016 వరకు షెద్యూల్ నిచ్చింది. ఈ షెడ్యూల్ కి రెండు రోజుల ముందు కాకినాడ ఇంచార్జ్ డీఎస్పీ బాధితులకి రక్షణ కల్పించలేమన్న సాకుతో విచారణని 26-09-2016 కి వాయిదా వేయించారు. ఈ క్రమంలో ప్రత్యేక పీపీని తప్పించారు. విచారణని వాయిదా వేయించారు. తమకు నచ్చిన పీపీని తమ తరుఫున నియమించమని బాధితులు హై కోర్టుని ఆశ్రయించారు.  హై కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే తోట త్రిమూర్తులు సామాజిక వర్గానికే చెందిన సలాది శ్రీనివాస్‌ని ప్రత్యేక పీపీగా ప్రభుత్వం నియమించింది. దీనిపై బాధితులు అభ్యంతరం తెలపటంతో హైకోర్టు వై. సుజాతని పీపీగా నియమించింది. ఈ సంఘటన పూర్వాపరాలను గమనించిన వారికి ప్రభుత్వం, న్యాయస్థానాలు నిందితుల పక్షానే వున్నాయని అర్థమవుతుంది. ఈనాటికీ బాధితులు ఏ ప్రలోభాలకి లొంగకుండా, బెదిరింపులను ఖాతరు చేయకుండా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. గడిచిన ఇరవయ్యేళ్ళలో నిందితులు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బలవంతులయ్యారు. బాధితులు మాత్రం కనీసం ప్రభుత్వ పధకాలకు కూడా నోచుకోకుండా అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అటు కాంగ్రెస్ సర్కారు, ఇటు టీడీపీ సర్కారు తమకు ఏమాత్రం న్యాయం చేయలేదన్నది బాధితుల వాదన.. తోట త్రిమూర్తులను దోషిగా తేల్చి జైలు పంపిస్తే.. కాపు సామాజిక వర్గం తమకు దూరమవుతుందన్న భయంతో ఆయా పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి..’

ఈ కేసులోనే అటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు, ఇటు తోట  త్రిమూర్తులుకు రాజకీయ వైరం నడుస్తోంది. మరి వీరిద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో.. చివరకు ఈ అంకం ఎక్కడకు చేరుకుంటుందో వేచిచూడాలి.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online