Skip to main content
Latest News

సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు.. పరిటాల కుటుంబానికి సూపర్ ఛాన్స్

ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పజెబుతున్నామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం ఇక్కడి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నామన్నారు. అయితే ఇందులో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. పరిటాల సునీత కుటుంబ సభ్యులతో చర్చించి ఎవరు ఎక్కడ ఇన్‌చార్జిగా ఉండాలో తెలియజేస్తామని చెప్పడంతో ధర్మవరానికి వారిరువురిలో ఎవరు బాధ్యత వహిస్తారన్నది తెలియాల్సి ఉంది.
 
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ  నియామకం కోసం  నేతలను ఆ పార్టీ నాయకత్వం అన్వేషించింది. కొత్త నేత ఎంపిక కోసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను చంద్రబాబునాయుడు రంగంలోకి దించారు. కొద్ది రోజుల క్రితం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పరిటాల రవి బతికున్న కాలంలో  వరదాపురం సూరి టీడీపీలో ఉండేవారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2012లో సూరి తిరిగి టీడీపీలో చేరారు. ఆ సమయం నుండి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో  మరోసారి ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే వరదాపురం సూరి చంద్రబాబునాయుడును కలిసి వచ్చారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అంతకుముందే ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. సూరి బీజేపీలోకి చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో మాజీ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, కాలువ శ్రీనివాసులు,  బీకే పార్థసారథి తదితరులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వరదాపురం సూరి టీడీపీని వీడి  బీజేపీలో చేరడంతో  ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ నియామకం టీడీపీ జిల్లా నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. మొత్తానికి పరిటాల కుటుంబానికే ధర్మవరం బాధ్యతలను అప్పజెప్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.