Skip to main content
Latest News

బోటు బయటకు తీయడం అసాధ్యమే.. చేతులెత్తేసిన నౌకాదళం

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దేవీపట్నం మధ్య గోదావరి నదిలో మునిగిన బోటును బయటకు తీయడం చాలా కష్టమని అధికారులు తేల్చేశారు. బోటు ప్రమాదంలో గల్లంతయిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. బోటు చాలా లోతులో ఉండటం వల్ల ఇంకా గుర్తించడం చాలా కష్టసాధ్యంగా మారిందని ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాలు చెబుతున్నాయి. బోటు అంతలోతులోకి కృంగిపోవడం రోజులు గడిచిపోవడంతో ఆచూకీ దొరకని 20 మంది ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. బోటును బయటకు తీస్తేనే అసలు విషయాలు తెలుస్తాయని వెల్లడించారు.

ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందాలు ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. బోటును వెలికితీయడంలో అత్యంత అనుభవం ఉన్న దశరథ్ అనే నౌకాదళ అధికారి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతను కూడా బోటు చిక్కుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించి చాలా కష్టమే అనే అంచనాకు వచ్చారు. బోటును బయటకు తీయడం అసాధ్యమని వారు చేతులెత్తేశారు. అయితే దేశంలో అందుబాటులో ఉన్న పూర్తి టెక్నాలజీని సైతం వాడినప్పటికీ బోటు జాడ దొరకడం లేదు. కొన్నేళ్ల క్రిందట బలిమెల రిజర్వాయ్‌లో మునిగిన బోటును వెలికితీసేందుకు వినియోగించిన పద్ధతిని టెక్నాలజీని ఇక్కడు తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో అమలు చేయొచ్చా అనే అంశాన్ని సైతం పరిశీలించారు. అయితే పూర్తి స్థాయిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మీదట ఆ పద్దతి ఇక్కడ అమలు చేయలేమంటూ తేల్చేశారు.

గోదావరి నదిలో 315 అడుగుల లోతులో బోటు చిక్కుకుని ఉండొచ్చన్న అంచనాకు వచ్చారు. స్క్యూబా డైవర్లు మహా అయితే 60 అడుగుల లోతువరకు వెళ్లగలరని ఆ తర్వాత కష్టమే అని అధికారులు తెలుపుతున్నారు. అంతేకాదు ప్రవాహ వేగం కూడా ఎక్కువగా ఉండటంతో అది చాలా కష్టంగా మారిందని చెప్పారు. ఇదిలా ఉంటే మృతదేహాలు ప్రవాహానికి బయటకు కొట్టుకు వస్తున్నాయి. సోనార్ రేడార్లను వినియోగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక బోటును గుర్తించేందుకు ఇసుక మేటలు అడ్డంగా నిలుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఒకవేళ బోటును గుర్తించినా.. దాన్ని బయటకు తీసే భారీ వాహనాల దొరికినా.. వాటిని సంఘటన  స్థలం వరకు తీసుకెళ్లడం ఎలా సాధ్యమన్న దానిపై కూడా అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online