Skip to main content
Latest News

బేర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసాలు.. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రసారం

ప్రముఖ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు సోమవారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యాయి. డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ను కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో తన బాల్యానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బేర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు మోదీ. తన చిన్నతనంలో మురికి బట్టలనే ధరించేవాడినని.. స్కూల్‌కు మాత్రం నీట్‌గా వెళ్లేవాడినని చెప్పారు. రాగి చెంబులో నిప్పులు వేసి దుస్తులను ఇస్త్రీ చేసుకునేవారమని గ్రిల్స్‌తో చెప్పారు మోదీ. ‘మాది గుజరాత్. వడ్నగర్ అనే చిన్న ఊళ్లో పుట్టాను. చదవుంతా అక్కడే సాగింది. మా జీవితం నిరాడంబరమైనది. తల్లిదండ్రులతో ఉమ్మడి కుటుంబంలో పెరిగాం. మాది చిన్న కుటుంబం. చిన్న ఇల్లు. ఇండియాలోని జీవన ప్రమాణాలతో పోల్చతే మాది పేద కుటుంబం. ప్రభుత్వ స్కూళ్లో చదివాం. మా జీవితం ప్రకృతితో ముడిపడి ఉండేది.  ప్రకృతి నుంచి నేను ఎంతగానో నేర్చుకున్నా. బట్టలు ఉతికేందుకు ఇప్పుడు సబ్బులు వాడుతున్నాం. కానీ మాకు డబ్బులు ఉండేవి కావు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. చలికాలంలో నేలపై మంచు బిందువులు పడేవి. కొంత సేపటి తర్వాత దానిపై ఉప్పులాంటి లేయర్ తయారయ్యేది. ఆ మట్టి పొరని పోగుచేసి ఇంటికి తీసుకొచ్చే వాళ్లం. దానితోనే బట్టలు ఉతికేవాళ్లం. స్నానం చేసేందుకు కూడా ఆ ఇసుకనే వేడి నీళ్లలోవేసి వాడేవాళ్లం. మా లైఫ్ స్టైల్ అలా ఉండేది..’... అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

‘నేను చిన్నప్పుడు చెరువులో స్నానం చేసేవాడిని. ప్రతి రోజు అక్కడే స్నానం చేసేవాడిని. మాకు వేరే మార్గం లేదు. ఓ రోజు స్నానం చేస్తుండగా చెరువులో మొసలి పిల్ల కనిపించింది. దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్లా. ఐతే తల్లీ బిడ్డలను వేరుచేయడదని మా అమ్మ నన్ను మందలించింది. వాటిని మనం పెంచలేమని చెప్పింది. తల్లీ పిల్లల్ని వేరు చేయడం తప్పని చెప్పింది. మళ్లీ ఆ మొసలి పిల్లను తిరిగి తీసుకెళ్లి చెరువులో వదిలిపెట్టా..’.. అంటూ మోదీ చిన్ననాటి సంగతులను బేర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు. తన బంధువు ఒకరు కట్టెల దుకాణం పెడతానంటే తమ నానమ్మ అందుకు ఒప్పుకోలేదని.. అవసరమైతే ఇంటిల్లిపాదీ పస్తులుందాం తప్ప ప్రకృతికి హాని కలిగించొద్దని చెప్పారని అతడికి తెలిపారు. చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని తమ నానమ్మ నమ్మడమే ఇందుకు కారణమన్నారు. చిన్నప్పుడు తన తండ్రితో పాటు రైల్వే ప్లాట్‌ఫాంపై టీ అమ్మింది డబ్బు కోసం కాదని.. తన తండ్రికి సాయం చేయడం తనకు ఇష్టమని, అందుకే చేశానని చెప్పారు.

‘‘చిన్నప్పుడు మీరు మంచి విద్యార్థేనా?’’ అని గ్రిల్స్‌ అడగ్గా.. మోదీ నవ్వేసి, తాను మంచి విద్యార్థినని చెప్పలేనన్నారు. పులుల నుంచి రక్షణకు ఆయుధాన్ని తయారుచేసిన గ్రిల్స్‌ దాన్ని మోదీ చేతికి ఇచ్చి ఎలా వాడాలో చెప్పగా.. ‘‘నా సంస్కారం ఏ ప్రాణినీ చంపనివ్వదు’’ అని మోదీ చెప్పారు. ‘‘మీరు జీవితంలో దేనికైనా భయపడ్డారా?’’ అని గ్రిల్స్‌ ప్రశ్నించగా.. ‘‘నా సమస్య ఏంటంటే.. అలాంటి భయాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు. అధైర్యం అంటే ఏమిటి? దాన్నెలా అధిగమించాలి వంటి విషయాలను నేను ప్రజలకు వివరించలేను. ‘నేను ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత నేను ఈ విధి నిర్వర్తించాలని దేశం నిర్ణయించింది. ఈ ప్రయాణంలో నా దృష్టి అంతా దేశాభివృద్ధి. దాంతో నేను సంతృప్తి చెందుతున్నా.. మీతో కలిసి జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో చేస్తున్న ఈ పర్యటననే సెలవుగా అనుకుంటే.. గత పద్దెనిమిదేళ్లలో నేను సెలవు తీసుకోవడం ఇదే మొదటిసారి...’.. అని మోదీ వివరించారు. 

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online