Skip to main content
Latest News

ఇక సెలవ్.. ముగిసిన కోడెల అంత్యక్రియలు..

టీడీపీ సీనియర్ నేతలు, అశేష అభిమానులు, కార్యకర్తలు, బంధువుల సమక్షంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది కార్యకర్తలు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, కేశినేని నాని, గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, బోండా ఉమ, దేవినేని ఉమతోపాటు రాష్ట్ర టీడీపీ ప్రముఖులంతా కోడెల అంతిమయాత్రలో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ప్రత్యేక వాహనంలో కోడెల పార్థీవ దేహం బయలుదేరగా.. ఆ వాహనంలో కోడెల కుటుంబ సభ్యులతో పాటు బాలయ్య కూడా కూర్చున్నారు. ఆ వాహనం ముందు చంద్రబాబుతోపాటు ఇతర నేతలంతా పాదయాత్రగా కదిలారు. 

దాదాపు పది కిలోమీటర్ల మేర పాదయాత్ర అంతిమయాత్ర నిర్వహించి కోడెలకు ఘన నివాళి అర్పించారు. జోహార్ కోడెల, జోహార్ పల్నాటి పులి.. నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్న వీధుల్లో నుంచి కాకుండా వేరే మార్గంలో అంతిమయాత్రను నిర్వహించారు. దీని వల్ల అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యమైంది. ఈ అంతిమ యాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. అంతిమయాత్ర సందర్భంగా నరసరావుపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాత్ర పల్నాడు రోడ్డు నుంచి మల్లమ్మ సెంటర్‌కు చేరుకోగానే కొందరు టీడీపీ కార్యకర్తలు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రి వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దూకుడుగా ఉన్న కార్యకర్తలను టీడీపీ నేతలు అదుపు నచ్చజెప్పడంతో.. కార్యకర్తలు శాంతించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆస్పత్రి వైపు పోలీసులు భారీగా మోహరించారు. అంతిమయాత్ర అక్కడి నుంచి దాటగానే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా మొదట్లో స్వర్గపురిలో కోడెలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే తాము ప్రభుత్వ లాంఛనాలను స్వీకరించబోమని కోడెల కుటుంబం తేల్చిచెప్పడంతో పోలీసులు మిన్నకుండి పోయారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అంతిమయాత్ర సాయంత్రం అయిదు గంటల తర్వాత స్వర్గపురికి చేరుకుంది. చివరిసారిగా కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రముఖులు కోడెలకు నివాళి అర్పించారు. ఆ తర్వాత అన్ని లాంఛనాలతో ఆయన  పార్థీవ దేహానికి కుమారుడు కోడెల శివరాం చితి అంటించారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online