Skip to main content
Latest News

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయండన్న జగన్.. మాకొద్దన్న కోడెల కుటుంబం..

‘మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపండి..’.. ఇదీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాలు.. ‘మీ ప్రభుత్వ లాంఛనాలు మాకేం వద్దు.. నిన్నటి వరకు వేధించి.. చిత్రహింసలు పెట్టి.. మానసిక క్షోభకు గురిచేసి.. ఆయన మరణానికి కారణమయిన మీరు.. ఇప్పుడు మొక్కుబడిగా ఇచ్చే అధికార లాంఛనాలు మాకేం అవసరం లేదు.. అశేష అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య అంత్యక్రియలు జరపడమే కోడెలకు సరైన నివాళి. పార్టీ శ్రేణులు నినాదాలే ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తాయి.. మీ అధికార లాంఛనాలు అందుకోవడానికి కోడెల కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరు..’... ఇదీ జగన్ ఆదేశాలకు కౌంటర్‌గా కోడెల కుటుంబ సభ్యులు చెప్పిన మాట. 

దీంతో కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపొద్దని, పార్టీ అభిమానుల మధ్యే జరపాలని కోడెల కుటుంబసభ్యులు, టీడీపీ నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం అర్ధరాత్రి నరసరావుపేటలో తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటట్లయితే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఇబ్బందిపడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యుల మనోగతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా.. కోడెల శివప్రసాద్ రావు భౌతికకాయానికి బుధవారం నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి  నరసారావుపేట వరకూ దారిపొడవునా అభిమానులు, పార్టీ శ్రేణులు కోడెల మృత దేహానికి నివాళులర్పించారు. మరోవైపు కోడెల అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. కోడెల సొంత నియోకవర్గంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online