Skip to main content
Latest News

వేధింపుల వల్లే ఆత్మహత్య.. జగన్ సర్కారుపై కేసు పెట్టిన కోడెల కుమార్తె

మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య వ్యవహారం ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.  వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా.. ఆయన బలవన్మరణానికి చంద్రబాబే ప్రధాన కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నా. టీడీపీ అధినేత తీరుపై వారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ఆయన కుమార్తె విజయలక్ష్మీ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వ వేధింపుల వల్లే తమ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ జగన్ సర్కారుపై కేసు పెట్టారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగానే తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధించేందుకు తన తండ్రిని వేధించిందని.. ఆయనపైన, తమ కుటుంబసభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి మానసిక క్షోభకు గురి చేసిందని ఆమె ఆరోపించారు. ఇది తట్టుకోలేక తన తండ్రి డిప్రెషన్‌లోకి వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. కోడెల మరణం తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం బాగుండకపోవడంతో విజయలక్ష్మి (48) పది రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 7లోని తండ్రి నివాసంలో ఉంటున్నారు. 

‘నాతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మానాన్నలను పరీక్షల నిమిత్తం సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను. అప్పటికే కొద్ది రోజుల నుంచి నాన్న తీవ్ర మనస్థాపంతో కనిపిస్తున్నారు. ఆ రోజు కూడా కాస్త దిగాలుగా కనిపించారు. ఉదయం 9.30 గంటలకు నాన్న తన మనస్సు ప్రశాంతంగా లేదని చెప్పి త్వరగా టిఫిన్‌ తినడం ముగించి, మొదటి అంతస్తులోని బెడ్‌రూంలోకి వెళ్లారు. 10.15 గంటలకు అమ్మతో పాటు ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పడానికి పై అంతస్తుకు వెళ్లాను. డోర్‌ ఎంత కొట్టినా తెరవకపోవడంతో ఆందోళన చెంది కిందకు వచ్చి అమ్మకు చెప్పాను. డ్రైవర్‌ మాహూఫ్‌ షరీఫ్‌, గన్‌మ్యాన్‌ ఆదమ్‌ మొదటి అంతస్తుకు చేరుకుని తలుపు తెరిచే ప్రయత్నం చేశారు. తలుపు తెరవకపోవడంతో బాల్కనీ వైపున్న డోర్‌ను తెరిచి లోపలకు వెళ్లి చూడగా కేబుల్‌ వైర్‌తో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ నాన్న కనిపించారు. వెంటనే ఆయన్ను దించి బసవ తారకం ఆస్పత్రిలోని డాక్టర్‌ సుమతికి సమాచారం ఇచ్చి అక్కడికి తరలించాం. డాక్టర్లు చికిత్స ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 12.39 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైసీపీ సర్కారు వేధింపుల వల్లే మా నాన్న చనిపోయారు.. దోషులకు శిక్ష పడాలి..’ అంటూ కోడెల కుమార్తె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online