Skip to main content
Latest News

కేశినేని భవన్ నుంచి టీడీపీ కార్యాలయం ఖాళీ.. కేశినేని నాని సెటైరికల్ కామెంట్స్

విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలించారు. ఇప్పటివరకూ పార్టీ అర్బన్‌ కార్యాలయం కేశినేని భవనంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అర్బన్‌ కార్యాలయాన్ని అక్కడ నుంచి తీసివేసి... ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోనే పని చేస్తుందని టీడీపీ ప్రకటన చేసింది.ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయం తరలింపు వెనుక బుద్దా వెంకన్న హస్తం ఉన్నట్లు కేశినేని నాని అనుమానిస్తున్నారు. ఇకపై విజయవాడ టీడీపీ అర్బన్‌ కార్యక్రమాలు అన్ని జిల్లా టీడీపీ కార్యాలయం నుంచే జరుగుతాయంటూ సోమవారం మీడియాకు లేఖ విడుదల చేయడంపై కేశినేని నాని ట్విటర్‌లో వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టారు. ‘‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేసిన కేశినేని.. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జత చేశారు.  కేశినేని భవన్‌ నుంచి టీడీపీ అర్బన్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయడం తనకే మంచిదన్నట్టు ఎంపీ కేశినేని పోస్టు చేసిన ట్వీట్‌ టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా.. మొన్నటి వరకు కేశినేని నానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న టీడీపీ అర్బన్‌ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కూడా ఇప్పుడు ఆయనకు దూరమయ్యారు. మొదటి నుంచి కేశినేని భవన్‌లోనే కొన సాగిస్తూ వస్తున్న అర్బన్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయడంతో టీడీపీ నాయకులు ఎంపీ కేశినేనికి మరింత దూరమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు భవిష్యత్‌లో దేనికి దారితీస్తాయో వేచి చూడాల్సిందే.ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన టీడీపీని వదిలి బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. కానీ తాను పార్టీ మారబోనని, టీడీపీలోనే కొనసాగుతూ తన అభిప్రాయాలను నిర్మొ హమాటంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అందుకనుగుణంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు లోక్‌సభలో టీడీపీ విప్‌ పదవిని ఇవ్వగా.. ఎంపీ తిరస్కరించారు. అంత పెద్ద బాధ్యతను తాను నిర్వహించలేనని, వేరొకరికి ఆ పదవిని అప్పగించాలని ఫేస్‌బుక్‌ ద్వారానే అధినేత చంద్రబాబుకు సమాధానమివ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online