Skip to main content
Latest News

కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. గులాబీ పార్టీలో అసంతృప్తి గళం!

ఆదివారం కేసీఆర్ చేసిన కేబినెట్ విస్తరణ.. టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది.. మంత్రి పదవిని ఆశించి భంగపడిన నేతలు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడుతుండగా.. మరికొందరు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అసంతృప్తి గళం వినిపించిన అధికార టీఆర్‌ఎస్‌ నేతలను బుజ్జగించే పని మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ అనంతరం పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్‌ మాట తప్పారని ఆరోపించగా.. జోగు రామన్న అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మైనంపల్లి బడ్జెట్‌ సమావేశాలకు హాజరవకపోగా.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయని, తొందరపడొద్దని, ఓపికగా ఉండాలని కేటీఆర్‌ వారిని అనునయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే టి.రాజయ్య, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో ప్రెస్‌మీట్లను ఏర్పాటు చేయించడంతోపాటు పలువురు నేతలు పార్టీకి, అధినేత కేసీఆర్‌కు విధేయత తెలియజేస్తూ ప్రకటనలు విడుదల చేశారు. 

ఈ క్రమంలోనే మంత్రి పదవి దక్కకపోవడంతో ఎలాంటి అసంతృప్తి లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. అలకబూనిన ఎమ్మెల్యే గాంధీ, గన్‌మెన్‌లను పంపించారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. తన మనవడిని చూసేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రెండు రోజుల పాటు గన్‌మెన్‌లను వాపస్‌ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి గన్‌మెన్‌లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణమైన ఆయన నగర శివార్లలోకి వెళ్లగానే గన్‌మెన్‌లను పంపించారనే ప్రచారం జరగడంతో వెనుదిరిగి వివేకానందనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి ఇలానే గన్‌మెన్‌లను పంపిస్తానని వివరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విధేయునిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కేటీఆర్‌ను కలిశానన్నారు.

కాగా.. మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంపై సర్వత్రా కలకలం రేగగా.. మంగళవారం ఆయన ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన రామన్న.. సోమవారం ఉదయమే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి గన్‌మెన్లను కూడా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి పదవి రాకపోవడంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల నుంచి వచ్చే ఫోన్లకు సమాధానం చెప్పలేకనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయాల్సి వచ్చిందని ఆయన కుటుంబీకులు, సన్నిహితులు చెబుతున్నారు. రక్తపోటు అధికం కావడంతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online