Skip to main content
Latest News

జనసేనకు షాక్.. భారీ ఫాలోవర్లు ఉన్న ట్విటర్ ఖాతాలు క్లోజ్

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన దాదాపు 300మంది ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సంస్థను ప్రశ్నిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఖాతాలను సస్పెండ్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయించినంత మాత్రాన జనసేన గొంతు మూగబోదని, 300 మంది ఖాతాలను సస్పెండ్ చేస్తే 3000 కొత్త ఖాతాలు పుట్టుకొస్తాయని వారు ఛాలెంజ్ చేస్తున్నారు. జనసేన పార్టీకి ట్విటర్‌లో దాదాపు 400 వరకు అకౌంట్లను శతఘ్ని టీమ్ ఏర్పాటు చేసింది. వీటిల్లో 300కు పైగా ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేయడం గమనార్హం. జనసేన శ్రేణులు గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో సేవ్ నల్లమల క్యాంపెయిన్ చేస్తున్నాయి. అలాగే వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే క్యాంపెయిన్‌ను కూడా షురూ చేశాయి. 

సేవ్ నల్లమల క్యాంపెయిన్‌ కారణంగా ట్విట్టర్ తమ ఖాతాలను సస్పెండ్ చేసే అవకాశం లేదని.. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ పనే కావచ్చని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. జగన్ తనకు నచ్చని న్యూస్ ఛానెళ్లను, ట్విట్టర్ ఖాతాలను నిషేధిస్తున్నారని.. మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని.. కొందరు జనసైనికులు ఆరోపిస్తున్నారు. జనసేనను చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతోందని ట్వీట్లు చేస్తున్నారు. జనసేన సోషల్ మీడియా ఖాతాలను మళ్లీ పని చేసేలా చూద్దామని పిలుపునిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అని ప్రచారం చేస్తున్నాయి. కానీ జనసేన ఖాతాలు మాత్రమే సస్పెండ్ కావడం గమనార్హం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పవన్ అభిమానులు జనసేనకు సంబంధించిన వార్తలను ఫార్వర్డ్ చేయడంలో ముందుంటారు. దీంతో భారీ ఫాలోవర్లు ఉన్న ఖాతాలు సస్పెండ్ కావడం జనసేనకు తాత్కాలికంగానైనా దెబ్బే.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online