Skip to main content
Latest News

రుణమాఫీ జీవోను కూడా రద్దు చేసిన జగన్.. మండిపడుతున్న రైతులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ సర్కార్ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వుల్ని రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన జీవో 38ని రద్దు చేస్తూ.. బుధవారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న.. 4,5 విడత రుణమాఫీ నిధులు రూ.7959.12 కోట్లు నిలిచిపోయాయట. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి 7959.12 కోట్లు చెల్లింపులకు సంబంధించి జీవో నెంబరు 38 గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తూ  జగన్ సర్కార్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో టీడీపీ సర్కార్ హయాంలో ఇచ్చిన హామీ పత్రాల సంగతేంటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు హామీ పత్రాలను ఇచ్చింది ఏపీ ప్రభుత్వమనీ.. పార్టీలు వేరయినా.. ప్రభుత్వం ఒక్కటేనని స్పష్టం చేస్తున్నారు. ఓ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని.. మరో పార్టీ అధికారంలోకి వచ్చి రద్దు చేయడమేంటని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నింటినీ రద్దు చేస్తున్న జగన్.. తాజాగా రుణమాఫీని కూడా రద్దు చేస్తారని రైతులు ఊహించలేకపోయారు. ‘రద్దుల జాబితాలోకి రుణమాఫీ జీవో కూడా చేరిందా జగనన్నా...’ అంటూ వారు వాపోతున్నారు.

రుణమాఫీ రద్దు చేయడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో గతంలో తీసుకున్న లోన్లు కట్టుకుండా ఆపేశారు. అయితే తొలి మూడు విడతలు రుణ మాఫీ చేసినా.. 4,5 విడతలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి.. కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రుణమాఫీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు తాజగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టాల్సిన రుణాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online

Tags