Skip to main content
Latest News

ఓడిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా ఛాన్స్.. అభ్యర్థిని గెలిపించిన మరో నేతకు కూడా..

ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను అధికారికంగా ఖరారు చేసారు. ముందు నుండి అంచనా వేస్తున్నట్లుగా తొలి రెండు పేర్లు అవే కాగా..మూడో పేరు విషయంలో మాత్రం అనేక తర్జన భర్జన తరువాత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకరమణ పేరును ప్రకటించారు. అదే విధంగా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కు అవకాశం ఇచ్చారు. అదే విధంగా.. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామక్రిష్టా రెడ్డి పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేసారు. అయితే ఇక్బాల్.. చల్లా రామక్రిష్టా రెడ్డి ఇద్దరూ కర్నూలు జిల్లాకు చెందిన వారే. ఈ ముగ్గురిలో ఇద్దరు తాజా ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన వారే. ఈ నెల 14న నామినేషన్లకు తుది గడువు కావటంతో తాజాగా జగన్ నిర్ణయం ప్రకటించారు. 

మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావడంతో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది. అనంతపురం జిల్లా హందూపురం నియోజకవర్గ నుంచి పోటీచేసిన మైనార్టీ నేత, రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహ్మాద్ ఇక్బాల్  టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇక్బాల్‌కు తొలి విడుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు. మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ కూడా రేపల్లె నుంచి పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఎంపిక కావడంతో ఆరు నెలల్లోగా ఏదేని చట్ట సభల్లో ప్రాతినిథ్యం తప్పనిసరి. దీంతో మోపిదేవికి ఎమ్మెల్సీ అనివార్యం కాబట్టి.. ఆయనకు కూడా స్థానం కల్పించారు. వీరిద్దరితోపాటు బనగానపల్లెలో వైసీపీ విజయానికి కృషి చేసిన చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి.

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 
Telugu News Online