Skip to main content
Latest News

మీరు సీఎంగా ఉన్నా ఇల్లు ఇచ్చేవాడిని.. జగన్‌కు లింగమనేని ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ లేఖ రాశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఆయన ఇంటిని కూల్చివేస్తారన్న ప్రచారం.. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలపై లేఖలో స్పందించారు. తన ఇంటి దగ్గర సీఆర్డీఏ అధికారులు చేస్తున్న హడావుడితో ఆందోళన చెందుతున్నాను.. చంద్రబాబుకు ఇంటిని అద్దెకు ఇచ్చినందుకు.. తనను ఆయన బినామీగా ప్రస్తావించడం ఆవేదన కలిగించిందన్నారు.

అవాస్తవాలు ప్రచురించి తనను ఆవేదనకు గురిచేశారన్నారు రమేష్. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని.. విజయవాడ, కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నా.. ఇక్కడ నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేని పరిస్థితులు ఉన్నాయన్నారు.కరకట్ట మీద ఉన్న తన గెస్ట్‌హౌస్‌ను చూసి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి యోగ్యంగా ఉంటుందని అధికారులు భావించారని.. ముఖ్యమంత్రిగారి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనకు తావు లేకుండా అంగీకారం తెలిపానన్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు లేవన్నారు. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. మరే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను అదే రీతిలో స్పందించేవాడిని అన్నారు. అలాగే లేఖలో గతంలో జరిగిన పరిణామాలను వివరించారు.

ఇలా కూల్చివేతల ధోరణి, వేదింపు చర్యలవల్ల ప్రభావితమయ్యేది తన ఒక్క కుటుంబం మాత్రమే కాదని గమనించాలి అన్నారు లింగమనేని. సీఆర్జీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ రాజధాని ప్రాంతంలోని లక్షల మందిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టివేస్తుందన్నారు. నిర్మాణాత్మకంగా సాగుతుంది అనుకున్న ఈ ప్రభుత్వం కూల్చివేతకే ప్రాధాన్యం ఇస్తుందా అనే ప్రశ్న ఆ ప్రజల్లో, రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. ఈ లేఖ ద్వారా తాను ఒక్కటే అడుగుతున్నానని.. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. అభివృద్ధిపథంలో ఉండాలి అంటే ఆర్థిక వ్యవస్థ, పొలన పటిష్టంగా ఉండి పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేయాలన్నారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట మీద ఉన్న ఇంట్లో ఉంటున్నారనే.. ఆ నిర్మాణాన్ని బలవంతంగా తొలగించేస్తాం అనే మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరం అన్నారు.

‘ఉండవల్లిలోని అతిధి గృహానికి 2012లో అప్పుడు ఉన్న చట్టపరమైన అన్ని అనుమతులూ పొందాం. ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్.ఓ.సి. కూడా తీసుకున్నాo. కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది నా ఒక్క కుటుంబం మాత్రమే కాదు. సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశానిస్పృహల్లోకి నెట్టివేస్తుంది. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏ మేరకు సబబు..’ అని లింగమేని వాపోయారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online