Skip to main content
Latest News

వేణుమాధవ్‌ను ఎన్టీఆర్.. ఏమని పిలిచేవారో తెలుసా..?

తెలుగులో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ వేణు మాదవ్ ఇకలేరు. గత కొంత కాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈ నెల 6న యశోద ఆసుపత్రిలో చేర్పించారు.  అప్పటి నుంచి ఆయనకు డయాలసీస్ చేస్తూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది.. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు.  టాలీవుడ్‌లో వేణు మాధవ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన పుట్టింది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.

ఈయనకు వెంట్రిలాక్విజం(బొమ్మ సాయంతో మిమిక్రీ చెప్పడం) మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో ముంబై నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి మిమిక్రి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకరోజు నల్గొండ ప్రదర్శన ఇస్తున్నపుడు చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ‘మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి వీరిని మనతో పాటే ఉంచండి’ అని అన్నాడు. అయితే తనకు సినిమాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉందని చెప్పగా.. చంద్రబాబు దానికి సరేనన్నారు. హైదరాబాద్‌లో తెలిసిన వాళ్లెవరూ లేరంటున్నావు కాబట్టి.. టీడీపీ ఆఫీసులోనే ఉండి.. సినీ ప్రయత్నాలు చేస్తూ.. పార్టీ కోసం పనిచేయమని కోరారు. 

మంచి వేతనం ఇవ్వడం, ఫుడ్డు బెడ్డుకు ఢోకా లేకపోవడంతో వేణుమాధవ్ దానికి సరేనన్నారు. ఆ తర్వాత టీడీపీ ఆఫీసులోనూ.. అన్నగారి ఇంట్లోనూ వేణుమాధవ్ పనిచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌కు వేణుమాధవ్‌కు మధ్య సాన్నిహిత్యం బాగానే పెరిగింది. ఓసారి కరెంట్ స్విచ్‌లు ఆపనందుకు వేణుమాధవ్‌ను బాగా తిట్టారట. రాత్రంతా బల్బులు వెలుగుతూనే ఉన్నాయని కోప్పడ్డారట. ఆ తర్వాత కొద్దిసేపటికే నెయ్యి పోసి షడ్రుచులతో అన్నం పెట్టించారట. ‘దేన్నయినా వృథా చేయడం మంచిది కాదు. మన పని ఏంటో మనం సక్రమంగా చేయాలి. అప్పుడే మనం చేస్తున్న వృత్తిలో రాణించగలుగుతాం. ఎవరో ఏదో చేస్తారులే అనుకుంటే కుదరదు..’ అని నెమ్మదిగా చెప్పారట. అలా ఎన్టీఆర్‌తో వేణుమాధవ్‌కు సాన్నిహిత్యం మరింత పెరిగింది. వేణుమాధవ్ బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని‘బొమ్మగారూ!’ అని ఆప్యాయంగా పిలిచేవారట. ఈ విషయాలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీకి ఆయన అందించిన సేవల గురించి తలచుకుని.. నివాళులు అర్పిస్తున్నారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online