Skip to main content
Latest News

ఏపీలో 12 రోజులు, తెలంగాణలో 16 రోజుల పాటు దసరా సెలవులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దసరా సెలవులను ఖరారు చేస్తూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణలో ఏకంగా 16 రోజుల పాటు దసరా సెలవులు ఉండగా... ఏపీలో మాత్రం 12 రోజుల పాటు దసరా సెలవులుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరకు విజయ దశమి సెలవులుగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అక్టోబరు 10 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

ఇక తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాలేజీలు పున: ప్రారంభం అక్టోబర్ 10నుంచి అని బోర్టు ప్రకటించింది. 

కాగా ఏపీలో దసరా సెలవులను అక్టోబరు 13 వరకు పొడిగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అక్టోబరు 10, 11 తేదీలను కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే.. అక్టోబరు 12 (రెండో శనివారం), అక్టోబరు 13 (ఆదివారం) సెలువులు ఉంటాయని.. అక్టోబరు 14న పాఠశాలలు తెరచుకుంటాయని వారు కోరుతున్నాయి. వీరి అభ్యర్థనపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అక్టోబరు 13 వరకు సెలవులు కొనసాగే అవకాశం ఉంది. అక్టోబరు 14న పాఠశాలలు తెరచుకుంటాయి. ఈ సంవత్సరం అక్టోబరు 6న దుర్గాష్టమి, అక్టోబరు 7న మహర్నవమి, అక్టోబరు 8న విజయదశమి పర్వదినాలు రానున్నాయి.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online