Skip to main content
Latest News

సొంతగూటికి విజయశాంతి.. అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి..!?

తెలంగాణలో బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 18వ తేదీన అమిత్ షా సభను పురస్కరించుకొని పలు పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు గాలం వేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన ముఖ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సినీ నటి విజయశాంతి కూడ బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా ఉన్న విజయశాంతి ఇటీవల కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకొన్నారు. మహేష్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమె యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడ పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించని కారణంగా ఆమె దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మాజీ ఉపముఖ్యమంత్రి ఒకరు, విజయశాంతితోపాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరనున్నారు. పలు నియోజకవర్గాల్లో తమకు పట్టు లేని నేపథ్యంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి నాయకులను చేర్చుకునేందుకు సాక్షాత్తూ పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణలో సంప్రదింపుల పర్వం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన మొత్తం ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ డిప్యూటీ సీఎంతో పార్టీ నాయకత్వం టచ్‌లో ఉందని బీజేపీ అగ్రనేత ఒకరు వెల్లడించారు. 

గతంలో బీజేపీలో క్రియా శీలకంగా వ్యవహరించి.. ఆ తరువాత సొంత పార్టీని పెట్టి.. దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి.. ఆపై కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి తిరిగి ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరబోతున్నారు. తెలంగాణ సాధన కోసం సొంతంగా తల్లీ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి. .ఆ తరువాత టీఆర్ఎస్‌లో విలీనం చేసారు. టీఆర్ఎస్‌ నుండి మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ సాధన సమయంలో పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. అయితే, ఆ సమయంలోనే పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవటంతో టీఆర్ఎస్‌ను వీడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రచారకమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలొ కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోనూ విజయశాంతికి సరైన ప్రాధాన్యత లభించటం లేదు. కీలక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం అందటం లేదు. దీంతో పార్టీలో విలువ లేకుండా కొనసాగలేమనే అభిప్రాయానికి విజయశాంతి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేతల నుండి సంప్రదింపులు మొదలయ్యాయి. ఇక, సొంత గూటికే చేరాలని విజయశాంతి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే పార్టీ అధినేత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరటం లాంఛనంగా తెలుస్తోంది. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online