Skip to main content
Latest News

రాజధానిపై మరో బాంబు పేల్చిన చింతామోహన్.. రహస్య సమాచారమంటూ..

ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. రాజధానిని తరలిస్తారనే ప్రచారంపై ఆందోళన వ్యక్తమవుతుండగానే.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పొలిటికల్ హీట్ నడుస్తుండగానే మధ్య, మధ్యలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అయోమయంలో పడేస్తున్నాయి. రాజధానిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కర్నూలులో ఏర్పాటు చేయాలని కొందరు.. తిరుపతిలో ఏర్పాటు చేయాలని మరికొందరు తమ వాదనల్ని వినిపిస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోందని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తనకు రహస్య సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌పైనే కాకుండా.. ఏపీ రాజధానిపై కూడా చింతా మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతి కావడం ఖాయమన్నారు. సీఎం జగన్ అమరావతిని వదిలిపెట్టి తిరుపతికి వచ్చేయాలని కోరారు. రాజధానికి తిరుపతి అన్ని విధాలా అనువైన ప్రాంతం అని చెప్పారు. మొత్తానికి జగన్ సర్కారు ఓ అధికారిక ప్రకటన చేస్తే కానీ.. రాజధాని తరలింపుపై ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చింతా మోహన్ చేసిన ఈ వ్యాఖ్యల్లో నిజమెంతో.. కొద్ది రోజులు ఆగితే కానీ.. చెప్పలేం..

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online